అవును! ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ విషయంపైనే మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకోవడం కష్టమేనని అందరూ అనుకుంటున్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. దీనికి వ్యవస్తీకృత కష్టాలే ఎక్కువగా ఉన్నాయని, నాయకుల దూకుడు పార్టీకి ఇబ్బం దిగా మారిపోయిందని, అధినేత చంద్రబాబు తప్పు ఏమీ లేదని, ఆయన పులు కడిగిన ముత్యంగా బాగానే ఉన్నారని అందరూ అనుకుంటూ వచ్చారు. బహుశ.. చంద్రబాబు కూడా ఇప్పటి వరకు ఇదే అనుకుని ఉంటారు. తన వల్ల పార్టీకి ఇబ్బంది లేదని, కేవలం నాయకులు, కార్యకర్తల లోపాలు, కలసిరాని వ్యవహారం కారణంగానే పార్టీ ఓడిపోయిందని ఆయన బావించి ఉంటారు.
అయితే, తాజాగా వైసీపీ ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేయడంతోపాటు పార్టీ అధినేత చంద్రబాబు చరిష్మానే టార్గెట్ చేసింది. ఆయననే బూచిగా చూపించే ప్రయత్నంలో వైసీపీ పూర్తిగా సక్సెస్ అయింది. నిజానికి పార్టీలో నాయకులు తప్పుదారి పడితే.. సరిదిద్దుకునేందుకు మరి కొందరు నాయకులు లేదా కార్యకర్తలు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. కానీ, ఇప్పుడు వైసీపీ ఎంచుకున్న వ్యూహం మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఏకంగా కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి! అనే రేంజ్లో వైసీపీ విజృంభించింది. చంద్రబాబు ఏ విషయాన్ని అయితే, తనకు అనుకూలంగా మార్చుకుని ఇన్నాళ్లూ ప్రజలకు దగ్గరయ్యారో.. అదే విషయంలో వైసీపీ చంద్రబాబును తీవ్రంగా ఇరుకున పెట్టింది. రాజధాని అమరావతి విషయంలో రెండు రోజుల కిందట అసెంబ్లీలో జరిగిన చర్చ మొత్తం.. చంద్రబాబు టార్గెట్‌గానే నడిచిందని మేధావులు, పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అమరావతిలో రైతులను , ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆయన ప్రభుత్వం బెదిరించి మరీ తన అనుకున్న వారికి, తన సామాజిక వర్గానికి మేలు చేసేలా వ్యవహరించారని అసెంబ్లీ సాక్షిగా దుమ్మెత్తి పోసింది.
ఈ ఆరోపణల వెనుక రాజధాని విషయంతోపాటు రాజకీయ విషయంకూడా దాగి ఉందనేది వాస్తవంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు విజన్ అంటే.. ఆయన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం, చంద్రబాబు పాలన అంటే.రైతులను, దిగువ తరగతి ప్రజలను మభ్య పెట్టేదిగా ఉందనేది వైసీపీ చేసిన రాజకీయ విమర్శగా వారు చెబుతున్నారు. దీనిని సమర్ధవంతంగా టీడీపీ తిప్పికొట్టక పోతే.. మున్ముందు చంద్రబాబుకే కాకుండా పార్టీకి కూడా తీరని ఇబ్బందులేనని అంటున్నారు. మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.