రాజధాని విషయం.. రాష్ట్రంలోని కొన్నిజిల్లాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలకు, నిరసనలకు కూడా కర్త, కర్మ, క్రియగా పెద్దదిక్కుగా టీడీపీ వ్యవహరిస్తున్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఎన్నికల సమయంలోను, తర్వాత కూడా పార్టీ కోల్పోయిన ప్రజాహవాను ఎంతో కొంత ఒడిసి పట్టాలనే చంద్రబాబు ప్రయత్నానికి కొంతమేరకు బూస్ట్ ఇచ్చినట్టే అయింది. అసలు పార్టీ ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చ నుంచి పుంజుకునే పరిస్థితి వచ్చిందనే వరకు అమరావతి రాజధాని ఉద్యమం పనిచేసింది.
అయితే, ఇదే రాజధాని ఉద్యమం కారణంగా టీడీపీలో బలమైన సామాజికవర్గంలో చీలిక వచ్చినట్టు చెబుతున్నారు. టీడీపీలో బలమైన సామాజిక వర్గం అంటే.. పార్టీఅధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గమే. అయితే, ఇప్పుడు రాజధాని వివాదం తెరమీదికి వచ్చిన తర్వాత.. తాము రాజధానిని ఎందుకు మార్చుతున్నాం.. అనే విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పడు జగన్ ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని తెరమీదికి తెచ్చింది. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారి వివరాలను ప్రభుత్వం పూసగుచ్చినట్టు అసెంబ్లీలో వివరించింది.
రాజధానిగా అమరావతిని ప్రకటించ డా నికి ముందుగానే పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన అనుకున్న వారికి ఈ విషయాన్ని చేరవేశారని, ఫలితం గా ఇక్కడ కొందరు మాత్రమే విరివిగా భూములు కొన్నారని ప్రభుత్వం అసెంబ్లీలోనే ఆయా పేర్లతో సహా వెల్లడించింది. దీంతో రాజధాని చుట్టుపక్కల ఎవరెవరు ఎంతెంత భూములు కొనుగోలు చేశారనే విషయం స్పష్టంగా వెల్లడైంది. ఇదే ఇప్పుడు టీడీపీలో అగ్గిని రాజేసింది. అది కూడా కమ్మ వర్గానికి చెందిన వారిలోనే అంతర్గతంగా పోరు జరుగుతోందని ఆలస్యంగా తెలిసింది. రాజధాని ప్రాంతానికి చెందిన కమ్మ వర్గం ఎక్కువగా ఇక్కడ టీడీపీకి మద్దతిస్తోంది.
అయితే, రాజధాని ప్రాంతానికి చెందిన వారు కాకుండా అనంతపురం , చిత్తూరు జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు పరిటాల సునీత, చంద్రబాబు సతీమణి, పయ్యా వుల కేశవ్ వంటివారికి, విశాఖకు చెందిన గీతం వర్సిటీ వంటి వి భూములు కొనుగోలు చేసినట్టు తెలియడంతో రాజధాని ప్రాంతం లోని కమ్మ వర్గానికి చెందిన కొందరు(వీరిలోనూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ భూములు కొన్నారు. జీవీ ఆంజనేయులు కొన్నా రు) మాత్రం చంద్రబాబుపై అలకబూనారు. మేం కూడా పార్టీకి ఎంతో కృషి చేస్తున్నామని, అయినా.. మాకు మాట మాత్రం తెలియ కుండా కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరించడం ఏమరకు సబబని.. మునిగితే.. నిండా మునిగేవారం కదా! ఇలా భేదభావం చూపించడం ఏంటని వారు అంతర్గతంగా బాబుపై ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే వారు రాజధాని ఆందోళనలకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం కారణంగానే చాలా మంది రాజధానికి చెందినకమ్మ వర్గం నేతలు ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతున్నా.. ఇంటికే పరిమితమయ్యారు. మరి ఇది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో చూడాలి.