నవీన్ నిశ్చల్. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన నాయకుడు. ఇక్కడ గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలనే ఆయన కోరిక ఇప్పటిది కాదు. 2004 నుంచి ఆయన ఇక్కడ పోటీ చేస్తూనే ఉన్నారు. ప్రజల మధ్య తిరుగుతు న్నారు. కానీ,ఆయనకు కాలం కలిసి రావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ ఆయన రెండో ప్లేస్లోనే ఉంటున్నారు. 2004లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 60 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. అయినా ఓటమి తప్పలేదు. ఇక, 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అప్పుడు కూడా ఓటమి తప్పలేదు. ఇక, 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనూ హోరా హోరీ పోటీ ఇచ్చినా.. టీడీపీ అనూహ్యంగా బాలయ్యను రంగంలోకి దింపింది.
దీంతో నవీన్ మరోసారి ఓడిపోయారు. టీడీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకును నవీన్ తనవైపు తిప్పుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపించింది. ఈ క్రమంలోనే ఇక్కడ గత ఏడాది జగన్ నవీన్‌ను పక్కన పెట్టి ఇక్బాల్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయితే, నవీన్ తాను ప్రతిపక్షంలో ఉన్నసమయంలో పార్టీని ఇక్కడ బలోపేతం చేశానని, కానీ, తనకు జగన్ అన్యాయం చేశారని పెద్ద ఎత్తున ఆరోపిస్తూ..పరోక్షంగా టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. ఫలితంగా గెలుస్తుందని భావించిన వైసీపీ ఇక్కడ మరోసారి ఓడిపోయింది.
నిజానికి బాలయ్యపై ఇక్కడ తీవ్ర వ్యతిరేకత ఉందని అప్పట్లో నివేదికలు కూడా అందాయి. అయినా కూడా నవీన్ వంటివారు చాపకింద నీరులాగా టీడీపీకి అనుకూలంగా పనిచేయడంతో బాలయ్య మరోసారి గెలుపుగు ర్రం ఎక్కారని ఇక్కడి పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నప్పటికీ.. నవీన్ మాత్రం ఇక్బాల్‌తో సానుకూల రాజకీయాలు చేయలేక పోతున్నారు. అడుగడుగునా ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. నియోజకవర్గంలో ఇక్బాల్‌కు వ్యతిరేకంగా వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన వారికి ఇక్కడి సమస్యలు ఏం తెలుస్తాయంటూ మీడియా మీటింగ్ పెట్టి మరీ సొంత పార్టీ నాయకుడు ఇక్బాల్‌ను విమర్శిస్తున్నారు.
అంతేకాదు, ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపైనా నవీన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వైసీపీలో నవీన్ వ్యవహారం వివాదాస్పదంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఇక్బాల్ కూడా నువ్వుంటే నువ్వంటూ.. నవీన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాను నియోజకవర్గానికి కొత్తే అయినా.. పార్టీకి నీలాగా ద్రోహం చేయలేదని విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం మాత్రం సాగుతోంది. అయితే, తాజాగా అందిన విషయం ఏంటంటే.. ఏదేమైనా బాలయ్యకు వాస్తవంగా హిందూపురంలో గట్టిపోటీదారు అయిన
నవీన్‌కు త్వరలోనే చెక్ పెట్టేందుకు అధిష్టాన్ గట్టి నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. మరి అది ఏంటో చూడాలి.