దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీలలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు ఇప్పటికే వెల్లడిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైకాపా తీర్థం పుచ్చుకోగా, ఇప్పుడు వారి బాటలోనే మరికొంత మంది టీడీపీ నేతలు పయనిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే తాజాగా మరో టీడీపీ నేత కూడా వైకాపాలో చేరారు.
పలువురు ప్రముఖ నేతలు ఇప్పటికే టీడీపీని వీడి వైకాపాలో చేరడంతో టీడీపీకి ఇప్పుడు రోజూ షాక్‌లాంటి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ పార్టీకి కర్నూల్ జిల్లాలో మరో షాక్ తగిలింది. ఆ జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఆయన సోదరుడు ప్రతాప్ రెడ్డిలు వైకాపాలో చేరారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న జగన్ నివాసంలో వారు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఇరిగెల సోదరులు వైకాపాలో చేరిన సందర్భంగా వారికి ఆ పార్టీ అధినేత పార్టీ కండువాలు కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఇరిగెల సోదరులతోపాటు మరికొంత మంది నేతలు కూడా జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఇటీవలి కాలంలో ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహార శైలిపై ఇరిగెల సోదరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ఈ విషయంపై పలుమార్లు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారట. కానీ చంద్రబాబు స్పందించకపోవడంతోనే తాము టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరామని ఇరిగెల సోదరులు తెలిపారు.