తెలంగాణ కొత్త క్యాబినెట్‌లో వీరికే మంత్రులుగా చాన్స్‌..?

-

తెలంగాణ రాష్ట్రంలో ఎట్ట‌కేల‌కు కొత్త ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గం కొలువుదీర‌నుంది. రెండు నెలల అనంత‌రం సీఎం కేసీఆర్ క్యాబినెట్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అందుకు ఈ నెల 19వ తేదీని ముహుర్తంగా నిర్ణ‌యించారు. అదే రోజున ఉద‌యం 11.30 గంట‌ల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రివ‌ర్గంలో ఏయే నాయ‌కుల‌కు చోటు ద‌క్కుతుంద‌నే చ‌ర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకుంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఉమ్మ‌డి జిల్లాలు ప్రాతిప‌దిక‌గానే మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌నున్నార‌ని తెలిసింది. కాగా పార్ల‌మెంట్ ఎన్నిక‌లు మ‌రో 3 నెలల్లో జ‌రిగే అవ‌కాశం ఉన్నందున కేవ‌లం 10 మందితోనే పాక్షికంగా మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం కూడా ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా ఏర్పాటు కానున్న ఆ మంత్రి వ‌ర్గంలో 5 మంది కొత్త వారేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మంత్రి వ‌ర్గంలోకి హ‌రీష్ రావు..?

సీఎం కేసీఆర్ త‌న క్యాబినెట్‌లో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నుంచి మాజీ మంత్రి సి.ల‌క్ష్మారెడ్డితోపాటు రెండోసారి విజ‌యం సాధించిన వి.శ్రీ‌నివాస్ గౌడ్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌చ్చ‌ని తెల‌సింది. అలాగే మెద‌క్ జిల్లా నుంచి ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, ఇదే ప్రాంతం నుంచి మ‌రో ఇద్ద‌రిని మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవ‌చ్చ‌ని తెలిసింది. అయితే నూత‌న‌ మంత్రివ‌ర్గంలో మాజీ మంత్రి హ‌రీష్ రావు పేరు లేద‌ని మొద‌ట్లో అంద‌రూ భావించారు. కానీ హ‌రీష్‌ను మంత్రివ‌ర్గంలోకి క‌చ్చితంగా తీసుకుంటార‌ని తెలిసింది. అలాగే కొప్పుల ఈశ్వ‌ర్‌, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, డాక్ట‌ర్ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, విన‌య్ భాస్క‌ర్‌, రెడ్యా నాయ‌క్‌, పువ్వాడ అజ‌య్ కుమార్ ల పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు సమాచారం.

కొత్త వారి కోసం పాత మంత్రుల త్యాగం..?

ఇక గ‌తంలో మ‌హిళ‌ల‌కు రాష్ట్ర క్యాబినెట్‌లో పెద్ద‌గా అవ‌కాశం క‌ల్పించ‌లేద‌నే విమ‌ర్శ‌ల‌ను దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ ఈ సారి ప‌లువురు మ‌హిళా ఎమ్మెల్యేల‌కు కూడా మంత్రి ప‌ద‌వుల‌ను ఇవ్వ‌నున్నార‌ని తెలిసింది. వారిలో మాజీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నుంచి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, నిజామాబాద్ నుంచి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, వ‌రంగ‌ల్ నుంచి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, విన‌య్ భాస్క‌ర్‌, న‌ల్ల‌గొండ నుంచి జి.జ‌గ‌దీష్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఇంద్ర క‌రణ్ రెడ్డి లేదా జోగు రామ‌న్న‌, హైద‌రాబాద్ నుంచి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ఓడిపోయారు క‌నుక‌, ఆయ‌న‌కు మ‌ళ్లీ మంత్రివ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పించాలా, వ‌ద్దా అనే విష‌యాన్ని కూడా సీఎం కేసీఆర్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే మంత్రివ‌ర్గంలో మాత్రం 10 మందికే చాన్స్ ఉంటుంద‌ని తెలుస్తుంది క‌నుక‌, కొత్త వారి కోసం మాజీలు త్యాగం చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news