హైదరాబాద్లో 15 నియోజకవర్గాలు ఉండగా సనత్ నగర్ నియోజకవర్గం ఎప్పుడు ప్రత్యేకమే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయం హాట్ హాట్ గానే ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వారంతా తన వైపే ఉన్నారని తలసాని శ్రీనివాస యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి తరఫున పోటీ చేసినా, బిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గెలుపు మాత్రం తలసానిదే. ఈసారి కూడా బిఆర్ఎస్ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించాలని తలసాని ఆశపడుతున్నారు.
గతంలో తలసాని టిడిపి నుంచి సికింద్రాబాద్ లో పోటీ చేసి గెలిచారు. కానీ 2014లో సనత్‌నగర్‌లో గెలిచారు. టిడిపి నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకోవడంతో టిడిపిని అభిమానించే వారు హార్ట్ అయ్యారు. దీంతో ఆంధ్రా నుంచి సెటిల్ అయిన టిడిపిని అభిమానించే వారు..అలాగే వైసీపీ, జనసేనలని అభిమానించే వారు సైతం తలసానికి ఓటు వేశారు. దీంతో భారీ మెజారిటీతో తలసాని గెలిచారు.
ఇక మళ్ళీ కేసిఆర్ కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఇక నియోజకవర్గానికి చాలా అభివృద్ధి పనులు చేశారు. ఈసారి ఎన్నికలలో తలసాని బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంటే, తలసానికి పోటీగా బిజేపి నుంచి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో రెండుసార్లు గెలిచిన మర్రి శశి ధర్ రెడ్డి బిజెపిలో చేరి ఇప్పుడు తన స్థానాన్ని మళ్లీ సంపాదించుకోవాలని పట్టుతో ఉన్నారు.
కాంగ్రెస్ కు కంచుకోట లాంటి సనత్ నగర్ లో మళ్ళీ తన ప్రాభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ అనుకుంటూ ఉంది. రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అటు టిడిపి కూడా ఈసారి సనత్ నగర్ లో పోటీ చేస్తానని ప్రకటించడంతో సనత్ నగర్ రాజకీయం రసవత్తరంగా మారింది.
తలసానికి ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు పడతాయని ధీమాతో ఉన్నారు. మరి ఈసారి, టిడిపి పోటీ చేస్తే తలసానికి పడే ఓట్లు చీలతాయి అని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. వీటన్నింటినీ జయించి తలసాని హ్యాట్రిక్ సాధిస్తారా లేదా ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే!