జడ్చర్ల మున్సిపాల్టీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఫోకస్ వీరి పైనే

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆ మున్సిపాలిటీలో ఎన్నికలు పార్టీల మధ్య పోరులా కాకుండా రియల్ ఎస్టెట్ వ్యాపారుల మధ్య వార్‌లా మారాయి. పురపోరును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు శాసిస్తున్నారు. అన్ని వార్డుల్లో వారి జోరే కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు సైతం వారినే నమ్ముకున్నాయి.ఇక రిజర్వేషన్లు అనుకూలించని చోట.. వెనకుండి రాజకీయాలు నడిపిస్తున్నారు. గెలిచేది ఎవరైనా జడ్చర్లలో రియాల్టర్ల అజెండానే అమలవుతుందనే చర్చ జోరందుకుంది.

 

జడ్చర్ల మున్సిపాలిటీకి కోర్టు కేసులు, విలీన గ్రామాల రగడ కారణంగా కొన్నాళ్లు ఎన్నికలు జరగలేదు. పదేళ్ల గ్యాప్‌ తర్వాత ఎన్నికల నగారా మోగింది. దీంతో అన్ని పార్టీలు పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఛైర్‌ పర్సన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో రియాల్టర్లు వెనకుండి చక్రం తిప్పుతున్నారని అనుకోవడానికి లేదు. మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నవారిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే ఎక్కువ. పార్టీ టికెట్‌ రాకపోతే ఇండిపెండెంట్‌లుగా బరిలో దిగిన వారూ ఉన్నారు. ప్రస్తుతం వార్డుల్లో ప్రచారానికి డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలను మించి డబ్బు బయటకు తీస్తున్నారట. కౌన్సిలర్‌గా గెలిస్తే వ్యాపార విస్తరణ చేసుకోవచ్చని.. భవిష్యత్‌ రాజకీయానికి బాటలు వేసుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారట.

బెంగళూరు హైవేకు ఆనుకుని జడ్చర్ల ఉండటంతో.. రియల్‌ భూమ్‌ను పెంచి క్యాష్‌ చేసుకోవడానికి చాలా మంది కన్నేశారు. అలాగే ఇక్కడ భూమి తగాదాలు ఎక్కువే. పవర్‌ చేతిలో ఉంటే ఇలాటి సమస్యలను చక్కబెట్టుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారట బరిలో ఉన్న అభ్యర్థులు. అందుకే ఖర్చుకు వెనకాడటం లేదని సమాచారం. టీఆర్‌ఎస్‌ బీఫాం ఇస్తుందని చాలా మంది వ్యాపారులు ఆశించారు. ప్రతి వార్డు నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అధికారపార్టీ అయితే గెలుపు సునాయాసమని భావించారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టికెట్లు రానివారు వెనక్కి తగ్గడానికి ఇష్టపడటం లేదట. దీంతో జడ్చర్ల టీఆర్‌ఎస్‌లో కొత్త పంచాయితీ మొదలైంది.

బరిలో ఉన్నవారంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే కావడంతో.. గెలిచే వరకు కుస్తీ పట్టి.. గెలిచాక పార్టీలకు అతీతంగా దోస్తీ చేయవచ్చని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అసలు సమస్యలు పక్కకెళ్లి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల మదిలో ఉన్న ఆలోచనలే మెయిన్‌ అజెండా అవుతాయని అనుమానిస్తున్నారట.