ఉమ్మడి తూర్పు గోదావరి వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల కోసం నేతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే అక్కడ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజాలకు పొసగడం లేదని కథనాలు వస్తున్నాయి. అటు పిఠాపురంలో ఎమ్మెల్యే దొరబాబు, కాకినాడ ఎంపీ గీతకు విభేదాలు ఉన్నాయి. అలాగే అమలాపురం ఎంపీ అనురాధ, మంత్రి విశ్వరూప్ వర్గాలకు సెట్ అవ్వడం లేదు. ఇలా రకరకాల రచ్చ నడుస్తుంది.
ఇదే క్రమంలో రామచంద్రాపురంలో మంత్రి వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రచ్చ నడుస్తుంది. ఆ సీటుని తన వారసుడుకు ఇప్పించుకోవాలని బోస్ ట్రై చేస్తున్నారు. గతంలో ఇది బోస్ సొంత సీటు..అందుకే ఇప్పుడు ఆ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో జగన్ పిలిచి..బోసుకు సర్దిచెప్పారు. బోస్ వారసుడు భవిష్యత్ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయినా సరే బోసు సీటు కోసం అవసరమైతే తన ఎంపీ పదవిని వదులుకోవడానికి సిద్ధమని అంటున్నారు. ఒకవేళ సీటు దక్కకపోతే ఆయన ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
ఈ రచ్చ జరుగుతుండగానే జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ ఎంపీ తోట నరసింహం వర్గాల మధ్య పోరు నడుస్తుంది. ఈ సీటు కోసం తోట గట్టిగా ట్రై చేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో తోట కాంగ్రెస్ నుంచి జగ్గంపేటలో గెలిచారు. 2014లో టిడిపి నుంచి కాకినాడ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో తోట వైసీపీలోకి వెళ్లారు. ఆయన భార్య పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు..ఇప్పుడు యాక్టివ్ అయ్యి..జగ్గంపేట సీటు ఆశిస్తున్నారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు ఈ సీటు వదులుకోవడానికి రెడీగా లేరు. ఇక వీరి మధ్య పోరు టిడిపి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకు కలిసొచ్చేలా ఉంది. వైసీపీలో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించేలా లేరు. దీని వల్ల జగ్గంపేటలో టిడిపిని గెలిపించేలా ఉన్నారు. మరి ఈ పోరుకు జగనే బ్రేకులు వేయాలి.