విజయవాడ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి.. పార్టీ అధినేతలకు కూడా సవాళ్లు రువ్విన ఆ స్వరం మూగబో యిందా? ఇక, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొన్నట్టేనా? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆయనే విజయవాడ పశ్చిమ నియోజవకర్గంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన మైనార్టీ నేత జనాబ్ జలీల్ ఖాన్. కాంగ్రెస్‌లో తీర్థం పుచ్చుకుని రాజకీయ అరంగేట్రం చేసిన జలీల్.. తర్వాత కాలంలో అదే పార్టీకి ఏకు మేకు అన్నచందంగా మారిపోయారు. తనకు టికెట్ ఇచ్చిన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌పైనే ఎదురు దాడి చేసిన నాయకుడిగా కాంగ్రెస్‌లో చరిత్ర సృష్టించారు.
అలాంటి నాయకుడు వైఎస్ అంటే ప్రాణం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు జగన్ స్థాపించిన వైసీపీలోకి వెళ్లి.. 2014లో విజయం సాధించారు. అయితే, ఎంతలేదన్నా.. రాజకీయ నాయకులకు ఉండే పదవీ వ్యామోహం.. ఈయనలోనూ పొడ చూపింది. ఈ క్రమంలోనే మంత్రి పదవిపై ఆశతో 2017లో పార్టీ మారి బద్ధ శత్రువుగా.. దద్దమ్మగా పేర్కొన్న చంద్రబాబు చెంతకు వెళ్లారు .. ఆయన నాయకత్వానికి జై కొట్టారు. ఆ తర్వాత నుంచి జగన్‌ను దూషించడం ప్రారంభించారు. అయితే, అనూహ్యంగా ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీస పరిజ్ఞానం లేకుండా బీకాంలో ఫిజిక్స్ చదివానని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే తన వారసురాలిగా అమెరికాలో స్థిరపడిన షబానా ఖతూన్‌ను తీసుకువచ్చి ఎన్నో ఎదరురీతల అనంతరం టికెట్ ఇప్పించుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అయితే, జగన్ సునామీ ముందు జలీల్ ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఖతూన్ మళ్లీ విమానం ఎక్కి అమెరికా వెళ్లిపోయారు. జలీల్ కూడా ఒకటి రెండు రోజులు ఫలితాలు విశ్లేషించినా.. తర్వాత ఇంటికే పరిమితమయ్యారు.
పార్టీ పిలుపునిచ్చినా.. ఏకార్యక్రమానికీ ఆయన హాజరు కావడం లేదు, మరోపక్క, అమెరికా నుంచి వచ్చి పోటీ చేసిన ఖతూన్ ఓడినా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పి.. వెంటనే తిరుగు టపా కట్టేశారు. దీంతో ఇప్పుడు జలీల్ ఖాన్ రాజకీయం ముగిసిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, టీడీపీలోని బుద్దా వెంకన్న ఒక వర్గంగా, కేశినేని నాని మరో వర్గంగా ఉండడంతో తాను ఏ వర్గంలో చేరాలో తెలియక ఎవరూ చేర్చుకోక పోవడం, ఆరోగ్య ం కూడా సహకరించకపోవడంతో జలీల్ ఇంటికే పరిమితమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక, జలీల్ ఖాన్ రాజకీయానికి ఎండ్ కార్డ్ పడిందని అంటున్నారు ఆయన అనుచరులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.