జీవో 64ను ఉపసంహరించుకోవాలని జనసేన డిమాండ్

-

జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉన్నతాధికారాలను జాయింట్‌ కలెక్టర్లకు అప్పగిస్తూ ఇచ్చిన జీవో నంబరు 64ను వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఓ ప్రకటన విడుదల చేసారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు మౌలిక వసతులు మెరుగుపరదాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మరచి వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై పెత్తనం చెలాయించేందుకు ఉత్సాహపడటం దురదృష్టకరమని జనసేన పేర్కొంది.

జనసేన
జనసేన

ప్రభుత్వ వైద్యులపై పెత్తనం చేసే అధికారాన్ని జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించడం ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయమని, ఈ నిర్ణయం వైద్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుందని తెలిపింది. ఈ జీవో వల్ల ఆసుపత్రుల నిర్వహణ నుంచి రోగుల సేవల వరకూ ఏ విషయంలోనైనా తక్షణ నిర్ణయాల కోసం జాయింట్‌ కలెక్టర్ల అనుమతి కోసం వేచి చూడక తప్పని పరిస్థితి వస్తుందని అంతిమంగా పేదలు ఇబ్బందిపడక తప్పదని అభిప్రాయపడింది.

పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకూ ఉండే పరిస్థితులు, వాటి నిర్వహణ, సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడం లాంటివి సీనియర్ వైద్యులకు అవగాహన ఉంటుందని… అలాంటి వారిని అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ గా నియమించాలని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నా పట్టించుకోకుండా.. జాయింట్‌ కలెక్టర్లకు అధికారాలు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని జనసేన ప్రశ్నించింది. జాయింట్‌ కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరతపై ప్రభుత్వ వైద్యులు బలంగా మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వైద్యుల విధుల్లో జోక్యం చేసుకోకుండా వెంటనే జీవో నెం.64 ను ఉపసంహరించుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news