ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా రైతులు చాలా వరుకు నష్టపోయారని, వారికి పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే చెల్లించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. గతేడాది జరిగిన పంటనష్టం ఇవ్వలేదని ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని, నష్టం అంచనాలను రూపొందించే ప్రభుత్వం పరిహారాన్ని మాత్రం అందించడంలో ఏమీ పట్టనట్లు ప్రవర్తిస్తున్నారని పవన్ విమర్శించారు.
భారీ వర్షాల కారణంగా రైతులు ఆగమవుతున్నారు. భారీ వర్షాలకు, వరదలకు తీవ్రంగా ప్రభావితం అయిన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన నాయకులు పర్యటించి, పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారు. అనంతరం, ప్రాథమిక అంచనాల ప్రకారం 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, వాస్తవంలో అంతకంటే ఎక్కువ పంటలు నష్టపోయి ఉంటాయని క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళిన జనసేన నాయకులు తెలిపారు.