తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలు కాబోతోంది. ఈనేపథ్యంలో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన రంగం సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణలో పోటీ చేయాలని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన కార్యకర్తలు, అభిమానుల నుంచి విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 5857 ఎంపీటీసీ 535 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వాళ్లు మాట్లాడారు. పవన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను ముందుగా తెలుసుకోవాలని ఆదేశించారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లోనూ అందుకే ఏడు స్థానాలలో పోటీ చేశామన్నారు. కానీ.. స్థానిక ఎన్నికల్లో పోటీ దీనికి భిన్నంగా ఉంటుందన్నారు. మన పార్టీకి యువత, మహిళలే బలం అని వాళ్లు ఈసందర్భంగా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు వాళ్లు తెలిపారు.