ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పట్లో ఆరేలా కనపడటం లేదు. రాజధాని మార్చాలి అనుకుంటున్నా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై తెలుగుదేశం సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇక రాజధాని ప్రాంతంలో రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు పోరాడుతూ వస్తున్నారు.
ఇక ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్లకు అండగా నిలుస్తూ రాజధాని ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిస్తుంది. ఈ నేపధ్యంలో ప్రత్యేక రాయలసీమ అనే నినాదం కూడా వినపడే అవకాశాలు కనపడుతున్నాయి. పలువురు రాయలసీమ ప్రాంత నాయకులు జగన్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
పిల్ల చేష్టలతో రాజధాని మారిస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని, గత 75 ఏళ్ళల్లో అమరావతిలో వరదలు ఎప్పుడు రాలేదని ఆయన అన్నారు. చంద్రబాబు తాత్కాలికం అనడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని జేసి అన్నారు. అమరావతిని మారిస్తే రాజధానిని కడపలో పెట్టాలని జేసి డిమాండ్ చేసారు. నదీ ఒడ్డున ఉన్న నగరాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు.