26న విజయవాడలో ప్రకటన?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. కొద్ది నెలల కిందట స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహారాష్ట్ర క్యాడర్ విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ నేతృత్వంలో పార్టీ ఏర్పాటవుతోంది. ఈనెల 26న ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారని సమాచారం. ఈ విషయంలో జేడీ లక్ష్మీనారాయణ బిజీబిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి విజయవాడలో ఆయనే స్వయంగా వివరించనున్నారని చెబుతున్నారు. సిబిఐలో జాయింట్ డైరక్టర్‌గా వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయటం ద్వారా ప్రాచుర్యం పొందారు. 7 ఏళ్లు సర్వీసు ఉండగానే పదవీ విరమణ తీసుకున్నాక రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రైతుల సమస్యలపై విస్తృతంగా పర్యటించారు. అనేక కళాశాలలను సందర్శించి విద్యార్థులను చైతన్యపరిచారు.
తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు బాగున్నాయని ప్రస్తావిస్తూనే.. బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలంలో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. బిజేపీ, ఆమ్ అద్మీ పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నా ఆయన సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉండనుంది, గ్రామస్థాయి మ్యానిఫెస్టో కోసం ఆయన ఇప్పటికే ఒక వెబ్‌సైట్ ప్రారంభించారు. కడప జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ తండ్రి జలవనరుల శాఖ ఉద్యోగి. దీంతో ప్రాధమిక విద్యాభ్యాసం కర్నూలు జిల్లా శ్రీశైలంలో సాగింది. వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్‌ఈసీ) నుంచి ఇంజనీరింగ్‌లో పట్టా, చెన్నై ఐఐటీ నుంచి ఎంటెక్ చేశారు. ఆయన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా జాయిన్ అయి ఈ ఏడాది పదవికి రాజీనామా చేశారు.