2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే ప్రకాశం,గుంటూరు జిల్లాల్లో అభ్యర్ధులను ఖరారు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్ధుల జాబితా కూడా కొలిక్కి తెచ్చినట్లు సమాచారం.కొంతమంది నేతలకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నామని చెప్తూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఖరాకండీగా తేల్చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులుగా కొత్తవారిని నియమించి సంపూర్ణ సహకారం అందించాలని పాతవారికి నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అంతిమంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యమని మంత్రులకు,ఎమ్మెల్యేలకు స్పష్టం చేస్తున్నారు.
రాష్ర్టంలోని అన్ని జిల్లాలపై కసరత్తు చేపట్టిన సీఎం జగన్ తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్ధులు ఎవరనేది తేల్చేశారు. ఇందులో అనూహ్యంగా 90 శాతం సిట్టింగులను మార్చేశారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించి వారి పేర్లను కూడా ఖరారు చేసినట్లు సమాచారం.ఉన్నట్టుండి మార్పులు చేయడంతో అభ్యర్ధుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీమోహన్‌కి విజయవాడ పార్లమెంట్ స్థానాన్నిఖరారు చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బొప్పన భావనకుమార్ ఓడిపోగా ఇప్పుడు ఆ స్థానాన్ని సామినేని ఉదయభానుకి ఇచ్చారు. విజయవాడ పశ్చిమం నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్‌కి ఈసారి మొండిచేయి ఇచ్చారు. ఆ స్థానంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మీని పోటీకి నిలిపారు. పెడన నుంచి 2019లో గెలుపొందిన జోగి రమేష్‌ను క్కడి నుంచి ఈ సారి మైలవరం పంపేందుకు సిద్ధమయ్యారు సీఎం జగన్. జోగి రమేష్‌కి మైలవరం టిక్కెట్ కేటాయించారని సమాచారం. నందిగామలో అమర్లపూడి కీర్తిసౌజన్యకు సీటు కేటాయించి ప్రస్తుత ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావును పక్కనపెట్టారు. ముఖ్యమంత్రి వద్ద పని చేస్తున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జోషి మరదలు ఈ కీర్తి సౌజన్య.
ఇక తిరువూరులొ కొత్త అభ్యర్ధిని నిలబెట్టే యోచనలో ఉన్నారు వైసీపీ బాస్.ఎమ్మెల్యే కొక్కలిగడ్డ రక్షణనిధికి ఈసారి నిరాశ తప్పేటట్లు లేదు. ఇక్కడి నుంచి ప్రభుత్వ మాజీ అధికారిని బరిలో దించుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా జగ్గయ్యపేట పేటలో వసంత కృష్ణ ప్రసాద్,గన్నవరం టిక్కెట్‌ని కొసులు పార్థసారథికి కేటాయించిన సీఎం,పెనమలూరు స్థానంలో దేవినేని అవినాష్ ని పోటీకి దింపారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల జాబితా కొలిక్కి రావలసి ఉంది.దీనిపై వైసీపీ పెద్దలు సీఎం జగన్‌తో మమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ జాబితా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
కాగా అభ్యర్ధుల మార్పుపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం ఆదేశిస్తే తప్పకుండా పాటిస్తానన్నారు. టిక్కెట్ కేటాయించకపోతే సీఎం జగన్ ఆధ్వర్యంలో పార్టీ కోసం పనిచేస్తానని,మరో పార్టీవైపు వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. తనకు సమర్ధత ఉందని గుర్తిస్తే తప్పకుండా టిక్కెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు.