తెలంగాణలో ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కచ్చితంగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని బిఆర్ఎస్ చూస్తుంటే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్, బిజెపి ఎదురు చూస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య మాత్రమే పోరుంటే, కొన్ని నియోజకవర్గాలలో త్రిముఖ పోరు తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. అటువంటి నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ ఒకటి.
జూబ్లీహిల్స్ అంటేనే గుర్తు వచ్చేది రిచ్ ఏరియా. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలుపును శాసించేది మాత్రం బస్తీ వాసులే. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బస్తీలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ బిఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. టిడిపి తరఫున ఒకసారి గెలిచిన గోపీనాథ్ బిఆర్ఎస్ తరఫున మరోసారి గెలిచారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గోపీనాథ్ ఎదురుచూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బస్తీ వాసులలో ఎక్కువమంది సంక్షేమ పథకాలు అందుకున్న వారే, వీరంతా తమ వైపే చూస్తారని బిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ తరపున ఎండి అజారుద్దీన్ బరిలో ఉన్నారు. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా అజారుద్దీన్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే వీరికి కలిసివచ్చే అంశం.
మరి జూబ్లీహిల్స్ వాసులు గోపీనాథ్ కు ఓటేస్తారా లేక అజారుద్దీన్ కు ఒక ఛాన్స్ ఇస్తారా వేచి చూడాల్సిందే…