ఆ టీడీపీ సీనియర్ వైసీపీ రీ ఎంట్రీ క‌న్‌ఫార్మ్‌..!

-

టీడీపీ సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తప్పు తెలుసుకున్నారా? మళ్ళీ చంద్రబాబుకు షాకిచ్చి జగన్ చెంతకు చేరనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  మొన్న ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి…ఆ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. చాలామంది నేతలు టీడీపీని వీడి బీజేపీ, వైసీపీలో చేరిపోయారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు లాంటి సీనియర్ నేత సైతం వైసీపీలో చేరిపోయారు.

తాజాగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల వరకు వైసీపీలోనే ఉన్న జూపూడి…ఆ తర్వాత టీడీపీలో చేరి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేశారు. అయితే మొన్న ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీకి దూరంగా ఉంటూ వస్తూ…తాజాగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అప్పుడు టీడీపీలో చేరి తప్పుచేశానని, ఇప్పుడు వైసీపీలో చేరి తప్పు సరిదిద్దుకున్నానని జూపూడి కామెంట్ కూడా చేశారు.

ఇక జూపూడి బాటలోనే టీడీపీ సీనియర్ నేత, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా పయనిస్తారని తెలుస్తోంది. త్వరలోనే జ్యోతుల కూడా జగన్ చెంత చేరిపోతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న జ్యోతుల…1994,99 ఎన్నికల్లో టీడీపీ తరుపున జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఓటమి పాలైన ఆయన…2009లో ప్రజారాజ్యంలో చేరి ఆ ఎన్నికల్లో జగ్గంపేట నుంచి మళ్ళీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వైసీపీలో చేరి 2014 లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ అయిపోయారు.

అయితే బాబు మంత్రి పదవి ఇస్తారని జ్యోతుల పార్టీ జంప్ చేశారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. ఇక మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి మొక్కుబడిగా పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు తప్ప, పెద్ద యాక్టివ్ గా ఉండటం లేదు. ఈ క్రమంలోనే జ్యోతుల టీడీపీలోకి వెళ్ళి తప్పు చేశానని, వైసీపీలో ఉంటే మళ్ళీ గెలిచి మంత్రి కూడా అయ్యేవాడిని అని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి జ్యోతుల బాబుకు ఎప్పుడు షాక్ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news