రాజ‌య్య నిర్ణ‌యంపై క‌డియం క‌ద‌లిక‌లు..!

క‌డియం శ్రీ‌హ‌రి టీఆర్ఎస్ పార్టీని వీడుతారా..?  మ‌ంత్రివ‌ర్గంలోనూ స్థానం ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న ఏం చేయ‌బోతున్నారు..?  ఒక్క‌సారిగా పార్టీలో, ప్ర‌భుత్వంలో ప్రాధాన్యం త‌గ్గిపోవ‌డంతో ఆయ‌న క‌ద‌లిక‌లు ఎలా ఉండ‌బోతున్నాయి..? ఎమ్మెల్యే రాజ‌య్య తీసుకునే నిర్ణ‌యానికి, క‌డియంకు లింకేమిటి..?   ఇప్పుడు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య ప్ర‌జ‌ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌లివే. అధ్యాప‌కుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. మ‌చ్చ‌లేని నేత‌గా ఎదిగారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే కీల‌క పద‌వులు చేప‌ట్టారు. మూడు సార్లు ఎమ్మెల్యే(స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌)గా, తొమ్మిదేళ్లు మంత్రిగా ప‌నిచేశారు.


ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. టీడీపీ ప‌రిస్థితి బాగా లేక‌పోవ‌డం.. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో ఆయ‌న గులాబీ గూటికి చేరారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న వ‌రంగ‌ల్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య‌ను కేసీఆర్‌ త‌ప్పించి.. డిప్యూటీ సీఎంగా క‌డియంను తీసుకున్నారు. ఆ త‌ర్వాత క‌డియం ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీ అయ్యారు. అంటే కేసీఆర్ తొలి ప్ర‌భుత్వంలో క‌డియం మంచి ప్రాధాన్యం ల‌భించింది.

ఇక్క‌డి వ‌ర‌కు అంతా స‌వ్యంగానే సాగింది. 2018లో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల్లోకి వెళ్లి.. తిరుగులేని విజ‌యం అందుకున్నారు. రెండో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి క‌డియంకు ప్రాధాన్యం ద‌క్క‌లేదు. డిప్యూటీ సీఎం ప‌ద‌వులను కొన‌సాగించ‌లేదు కేసీఆర్‌. ఆ త‌ర్వాత తొలికేబినెట్‌లోనైనా త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు క‌డియం. ఇటీవ‌ల చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనైనా అవ‌కాశం ఉంటుంద‌ని భావించారు. కానీ.. కేసీఆర్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వ‌లేదు.

నిజానికి.. మొద‌టి మంత్రివ‌ర్గంలోనే త‌న‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతో ఒక్క‌సారిగా క‌డియం ప్రాధాన్యం త‌గ్గిపోయింది. మొద‌టి ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా హ‌డావుడి చేసిన క‌డియం ఇప్పుడు ఓ సాధార‌ణ‌ నేత‌గా మిగిలిపోయారు. అయితే.. ఇక్క‌డ కేసీఆర్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. తొలి కెబినెట్‌లోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కిన పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుదే ఇప్పుడు హ‌వా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే క‌డియం శ్రీ‌హ‌రి పార్టీ మారుతార‌ని, ఆయ‌న బీజేపీలోకి వెళ్తార‌నే టాక్ వినిపించింది.

కానీ.. ఈ ప్ర‌చారాన్ని ఖండించారు క‌డియం. అయితే.. ఇక్క‌డ త‌న‌కు కూడా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఎమ్మెల్యే రాజ‌య్య తీసుకునే నిర్ణ‌యంపై క‌డియం క‌ద‌లిక‌లు ఉంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. రాజ‌య్య టీఆర్ఎస్‌ను వీడితే.. క‌డియం ఉంటార‌ని, రాజ‌య్య టీఆర్ఎస్‌లోనే ఉంటే.. క‌డియం వీడుతార‌నే స‌రికొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!