పంజాబ్‌లోని మొహాలీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది.
పంజాబ్‌లోని మొహాలీ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ 151 పరుగులు చేసి సఫారీలపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో 3 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
కాగా మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేశారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 52 పరుగులు, 8 ఫోర్లు), టెంబా బవుమా (43 బంతుల్లో 49 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా, నవ్‌దీప్ సైనీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు తలా 1 వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లి (52 బంతుల్లో 72 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు మరో భారత బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ (31 బంతుల్లో 40 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) కూడా రాణించడంతో భారత్ విజయం సులభతరం అయింది. చివరకు 19వ ఓవర్ ఆఖరి బంతికి శ్రేయాస్ అయ్యర్ 4 కొట్టి భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. కాగా సఫారీ బౌలర్లలో పెహ్‌లుక్‌వాయో, తబ్రెయిజ్ శంషీ, ఫార్టుయిన్‌లకు తలా 1 వికెట్ దక్కింది. ఇక ఈ సిరీస్‌లో చివరిదైన 3వ టీ20 ఈ నెల 22వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.