జైలుకైనా రెడీ అంటున్న కవిత..స్కామ్‌పై నో క్లారిటీ.!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవిత పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్‌లో కవిత ఉన్నారని మీడియాలో ప్రచారం జరిగిందే తప్ప..అధికారికంగా ఈడీ..ఆమె పేరుని చెప్పలేదు. కానీ తాజాగా అమిత్ అరోరా ఇచ్చిన రిపోర్టులో కవిత పేరు వచ్చింది.   ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చేశారు? ఆప్‌ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను ఎవరు ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే విషయాలను కోర్టుకు ఈడీ వివరించింది.

ఇలా రిపోర్టులో కవిత పేరు రావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయంలో పలువురుని అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. దీంతో కవితని కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో దీనిపై కవిత స్పందిస్తూ.. ప్రధాని మోదీ  రావడానికి ముందు ఈడీ రావడం కామన్ అని, బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని, 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. మోదీ వచ్చే ముందే రాష్ట్రానికి ఈడీ వచ్చిందని, తనపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని, ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని, ‘కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. భయపడేది లేదు’ అన్నారు.

ఈడీతో గెలవాలనుకుంటే తెలంగాణలో కుదరదని, ప్రజలు తమ వెంట ఉన్నంతకాలం తమకు ఇబ్బంది లేదని కవిత చెప్పుకొచ్చారు. అయితే ఈడీ రిపోర్టులో తన పేరు రావడం అనేది బీజేపీ కుట్ర అన్నట్లు కవిత చెప్పుకొచ్చారు. ఇది కేవలం రాజకీయ కక్ష కోణంలో హైలైట్ చేయడానికి చూశారు. అయితే ఈడీ రిపోర్టులో ఉన్న అంశాలపై మాత్రం కవిత వివరణ ఇవ్వలేదు. లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధం లేదనే గట్టిగా చెప్పట్లేదు. విచారణకు అవసరమైతే అరెస్ట్‌కు రెడీ అంటున్నారు. అంటే ఇందులో బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే అంశమే హైలైట్ చేస్తున్నారు