తెలంగాణలో కేసీఆర్ సర్కారు నేడు కొలువు తీరనుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగాకేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్.. కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కేసీఆర్ తో పాటుమరొకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో ఐదారు రోజుల తర్వాత మిగితామంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది.
ఈసందర్భంగా శాసనసభ ఎన్నికల ఫలితాలపై గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయగా… మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ ను టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దానికి సంబంధించిన తీర్మాన పత్రాన్ని ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు అందించారు.
అనంతరం కేసీఆర్, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ లేఖలను కూడా గవర్నర్ కు సమర్పించారు. ఆయన వాటిని ఆమోదించిన అనంతరం… కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు టీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించి.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ సూచించారు. దానికి సంబంధించి గెజిట్ ను ఈసీ రూపొందించింది. గెజిట్ ను కూడా గవర్నర్ ఆమోదించడంతో కేసీఆర్ సర్కారు ఇవాళ కొలువు తీరనుంది.