జేసీ కుటుంబానికి నామినేటెడ్ పదవి…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు ఊపందుకున్నాయి. చంద్రబాబు కేబినెట్ లో చాలామంది కొత్తవారికి అవకాశం కల్పించారు. సీనియర్లకు మొండిచేయి ఎదురైంది. దీంతో వాళ్ళందరూ ఎదో ఒక నామినేట్ పోస్ట్ పట్టేందుకు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే హామీని గుర్తు చేస్తూ ఏదో ఒక పదవి ఇవ్వలని నేరుగా చంద్రబాబునే కోరుతున్నారు. అటు బీజేపీ, జనసేన నుంచి కూడా నామినేట్ పదవుల కోసం ఆశావహులు చాలామందే ఉన్నారు. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ కుటుంబానికి ఓ పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు టాక్ నడుస్తోంది. జేసీ పవన్ కుమార్ రెడ్డికి కీలక పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ రెడ్డి ఇటీవల నారా లోకేష్‌ని కలవడంతో జిల్లాలో ఆ ప్రచారం మరింత ఊపందుకుంది.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. అనంతపురం ఎంపీగా పోటీ చేసేందుకు దివాకరరెడ్డి వారసుడికి సామాజిక సమీకరణలు కలిసి రాలేదు. పవన్ టికెట్ త్యాగం చేసి అనంతపురం పార్లమెంట్ స్థానంలో టీడీసీ గెలుపొందడానికి కృషి చేశారు. దాంతో అనంతపురం ఎంపీగా టీడీపీ అభ్యర్ధి అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందారు. జిల్లా ప్రాముఖ్యత ఉన్న కుటుంభం కావడంతో టీడిపి అధిష్టానం కూడ వారికి ఏదో ఒక పదవి ఇచ్చి న్యాయం చేయాలని చూస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని అనుకుంటోంది. రేపో మాపో ప్రకటించనున్న ఈ జాబితాలో పవన్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.

ఏపీలో నామినేట్ పోస్టుల భర్తీకి సమయం ఆసన్నమైంది. జేసీ కుటుంబానికి నామినేటెడ్ పదవులపై ఆసక్తి లేదు. కానీ టిడిపి అధిష్టానమే వారి కుటుంబానికి ఏదో ఒక పదవి ఇవ్వాలని భావిస్తుందట. గతంలో జేసీ పవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఈ సారి కూడా అదే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు
తాజాగా మంగళగిరిలోని నారా లోకేష్ క్యాంప్ ఆఫీస్‌లో లోకేష్‌ని పవన్ రెడ్డి కలవడంతో ఇప్పుడు మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది.

జేసీ పవన్ రెడ్డికి చాలామంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో మంచి పరిచయాలు ఉన్నాయి. క్రికెటర్లు ఎంఎస్ ధోని, సచిన్ టెండుల్కర్, బాలివుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వంటి వీవీఐపీలతో స్నేహం ఉంది. హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినా ఎమ్మెస్ ధోని.. పవన్ రెడ్డి ఇంట్లో బస చేస్తారు. అలాంటి పవన్ సేవలను వాడుకోవడానికి టీడీపీ ఖచ్చితంగా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. మరి అధినేత మనసులో ఏముందో త్వరలో తేలిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news