ఏపీలో అధికార పార్టీ టీడీపీ నుంచి ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. కాగా త్వరలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్సార్‌సీపీకి వలసలు ప్రారంభమయ్యే సూచనలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా మరో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కూడా వైకాపాలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి త్వరలో వైఎస్సార్‌సీపీలో చేరుతారని ఆమే స్వయంగా ఇవాళ తెలిపారు.
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు. ఇవాళ ఆమె లోటస్‌పాండ్‌లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 28వ తేదీన అమరావతిలో జరగనున్న కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారని తెలిపారు. వైఎస్ జగన్‌ను సీఎంను చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలపై తనకు నమ్మకం ఉందన్నారు.
చంద్రబాబు బీసీలను వాడుకుని వదిలేస్తారని, వైఎస్ జగన్ మాట తప్పరని, మడమ తిప్పని వ్యక్తి అని కిల్లి కృపారాణి అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు మాట మార్చారని, ఆయన ఏపీ ప్రజలను మోసం చేశారని, అందుకని ఇకపై ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలను ఏమాత్రం నమ్మరని అన్నారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను వ్యతిరేకించానని, ఆ విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. బీసీలను, కులవృత్తులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. తాను వైకాపాలో టిక్కెట్ ఆశించి చేరలేదని, తాను జగన్ తో కలసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నానని, ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన లక్ష్యమని కిల్లి కృపారాణి అన్నారు.