కొడాలి వన్ మ్యాన్ షో.. కట్టడి చేసే వారెవరు..?

-

కొడాలి నాని పరిచయమే అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి  ఒక్కరికి సుపరిచితమైన పేరు గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని. ఒకప్పటి తెలుగుదేశానికి కంచుకోట లాంటి గుడివాడలో వైసీపీ ఆవిర్భావంతో జగన్ కూటమిలో చేరిన నాని తన హవాని కొనసాగిస్తూ వచ్చారు. వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కొడాలి నాని.. ఈసారి కూడా విజయాన్ని వరించాలని ఆశయంతో ఉన్నారు. ఈసారైనా నానిని ఓడించి తమ జెండాను గుడివాడలో ఎగరేయాలని టిడిపి నేత అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగా కోరుకుంటున్నారు.

2004, 2009లో టిడిపి తరఫున పోటీ చేసి ఘన విజయాన్ని సాధించిన కొడాలి 2012లో వైసీపీలో చేరి 2014లో, 2019లో కూడా తన ప్రహసనాన్ని కొనసాగించారు. 2014 ఎన్నికల్లో చిరకాల ప్రత్యర్థి రావి వెంకటేశ్వరరావు పై అత్యధిక ఓట్లతో మెజారిటీ సాధించారు. కానీ 2019లో స్థానికేతరుడైన, సొంత సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ ను పోటీగా నిలబెట్టారు. అప్పుడు రావి వెంకటేశ్వరరావు కూడా అవినాష్ కు మద్దతుగా నిలబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంగ బలం అర్థబలంతో కొడాలి నానికి చెక్ పెట్టవచ్చనే చంద్రబాబు నాయుడు ఆలోచనను తప్పని నిరూపిస్తూ గుడివాడ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ నానికి తమ ఓటు వేశారు.

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని మంత్రి పదవి ఇచ్చి జగన్ సముచిత స్థానాన్ని ఇచ్చారు. జగన్ మీద ఈగ వాళ్ళనివ్వకుండా రక్షణ కవచంలా కొడాలి నాని నిలబడ్డారు అని అనడంలో అతిశయోక్తి లేదు. జగన్ ను విమర్శించిన వారు సొంత సామాజిక వర్గం వారైనా, ప్రతిపక్ష నాయకులైన, ఎవరైనా కొడాలి నాని మాటల దాటికి తట్టుకోవటం అంటే కష్టమైన పని అని చెప్పవచ్చు.

2019 తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కరి దృష్టి గుడివాడ పైనే ఉంది. నానికి పోటీ లేదని కొందరు, ఎవరిని నిలబెట్టలేరని కొందరు ఇలా రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్నికల తర్వాత అవినాష్ టిడిపికి స్వస్తి చెప్పి వైసీపీలో చేరారు. గుడివాడలో నానికి ప్రతిపక్షంగా రావి వెంకటేశ్వరరావు టిడిపి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కొడాలిని ఎదుర్కోవడానికి ఈసారి రావి వెంకటేశ్వరరావు గట్టిపట్టు సంపాదించుకున్నాడు అని అందరూ అనుకునే తరుణంలో అనూహ్యంగా ఒక ఎన్నారై గుడివాడ టిడిపి అభ్యర్థి అంటూ తెరపైకి వచ్చాడు. అతనే “వెనిగండ్ల రాము”. సేవా కార్యక్రమాలు అంటూ ఫౌండేషన్ పేరుతో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ మమేకమవుతూ ఈసారి టిడిపి తరఫు అభ్యర్థిని నేనే, నానికి పోటీ నేనే అని ప్రజలలో ఒక అభిప్రాయాన్ని తీసుకువచ్చారు.

టికెట్ ఎవరికీ ఇస్తారు నానికి పోటీ ఎవరు అనే ప్రశ్నకి మాత్రం అందరిలో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలలో లాగానే జెండా మోసిన రావికి కాకుండా మరో బయట వ్యక్తికి గుడివాడ నియోజకవర్గ టికెట్ ఇస్తే ప్రజలు ఎన్నుకుంటారా లేదా అనేది ఇప్పటి ప్రశ్న. ఇప్పటికే గుడివాడ టిడిపిలో మూడు వర్గాలుగా ఉన్నాయి రావి, వెనిగండ్ల, శ్లిష్టా & పిన్నమనేని వర్గాలు. అవినాష్ కు సపోర్ట్ చేసినట్టు రావి వెంకటేశ్వరరావు ఈసారి వెనిగండ్ల రాముకి మద్దతునిస్తారన్నది సమాధానమే లేని ప్రశ్న!!!.

వెనిగండ్లకు సొంత సామాజిక వర్గ మద్దతు తక్కువే అని విశ్లేషకుల అభిప్రాయం. సేవా కార్యక్రమాలు చేసి జాబ్ మేళాలు పెట్టి ప్రజలందరికీ చేరువవుతున్నా కొన్ని మండలాలలో రాము ఉనికి తక్కువగానే ఉంది.         ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం తరఫున ఇప్పుడు రావి, వెనిగండ్ల ఇద్దరూ తమ స్వరం వినిపిస్తున్నారు కానీ అవి ఓట్లుగా మారతాయా!!! టిడిపి అధినేత ఎవరికి టికెట్ ఇస్తారో???!!!! నాని వ్యతిరేక ఓట్లు చీల్చి టీడీపీ గుడివాడ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుందో లేక టిడిపి వర్గ పోరు కొడాలి నానికి బలాన్ని చేకూరుస్తాయో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news