కాంగ్రెస్‌లో తనపై అపనమ్మకం పెరిగిపోతోందని బాధపడుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.దీనికి కారణం తాను మరో ఏక్‌నాథ్‌షిండేగా మారబోతున్నారని వస్తున్న ఆరోపణలే. ఈ కామెంట్లు పదే పదే వినిపిస్తుండటంతో కోమటిరెడ్డికి కోపం వస్తోంది. ఆఖరికి మీడియా చిట్ చాట్‌లలో కూడా షిండేగా మారుస్తూ విలేఖరులు సైతం ప్రశ్నలు లేవనెత్తడంతో ఆయన హర్ట్ అవుతున్నారు.కాంగ్రెస్ పార్టీలో చీలిక తెస్తానన్నట్లుగా మాట్లాడుతున్న బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కోమటిరెడ్డి ఆగ్రహం చెందుతున్నారు. రిద్దరూ చేస్తున్న ప్రకటనలతో.. తన పై కాంగ్రెస్ లో అపనమ్మకం పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలకు చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ప్రకటించేశారు వెంకటరెడ్డి. కాంగ్రెస్ లో గ్రూపులు లేవని.. మరో పదేళ్ళు రేవంతే తెలంగాణ సీఎం అని అంటున్నారు.
కోమటిరెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి నరేద్ర మోదీని కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కవ కాలం ఉండదని చెప్తున్నారు విపక్ష రాజకీయ పార్టీల నేతలు. ఇదే క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కవగా కోమటిరెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. కోమటిరెడ్డితో పాటు ఖమ్మం మంత్రి పొంగలేటి సుధారకర్ రెడ్డిని కూడా ఈ మధ్య షిండే ఖాతాలో కలిపేసుకుంటున్నారు. వీరిద్దరిలో ఒకరు ఖచ్చితంగా షిండే అవుతారని.. త్వరలోనే బీజేపీతో కలుస్తారన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన వారిలో కోమటిరెడ్డి కూడా ఒకరు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లోనే ఆయన ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి పై ఎక్కువగా అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి ఆవేదనకు గురవుతున్నట్లు అనుచరులు చెప్తున్నారు. తనను షిండేతో పోలుస్తూ.. చేసే ప్రచారాలు మరింత పెరిగితే..తనపై కాంగ్రెస్ లో నమ్మకం సడలిపోతుందని ఆయన బాధపడినట్లు తెలుస్తోంది.దీంతో మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనతో గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కోమటిరెడ్డి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.అందుకే మహేశ్వర్‌రెడ్డిపై హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఇంకో సారి ఎవరైనా తన పేరు ప్రస్తావనకు తెచ్చి షిండే అవుతారని అంటే మరింత గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.