అప్పుడు బాబాయ్ కాంగ్రెస్ ని ముంచితే… ఇప్పుడు అబ్బాయి బాబాయ్ ని ముంచాడు…!

-

మహారాష్ట్రలో అధికారం ఊహించని మలుపులు తిరిగి బిజెపి ఇంటి ముందు ఆగింది. మోడీషా వ్యూహంతో అధికార లక్ష్మి రాజభవన్ వేదికగా బిజెపి బుట్టలో పడింది. ఇక ఇప్పుడు ఎన్సీపీలో ఈ పరిణామం చిచ్చు రాజేసింది. నమ్మకంగా ఉండే అజిత్ పవార్ ఇంత పని చేస్తాడని తాము ఊహించలేదు అంటూ ఎన్సీపీ నేతలు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని ఎవరు నిందించుకోవాలో అర్ధం కాక కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన తలలు పట్టుకున్నాయి.

ఇప్పుడు ఇది పక్కన పెడితే… నమ్మిన బంటులా ఉండే అజిత్ పవార్ ఈ విధంగా ఎందుకు చేసారు అనేది మూడు పార్టీలకు అర్ధం కావడం లేదు. దీనిపై బిజెపి నేతలు స్పందిస్తూ అప్పట్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ ని చేసిన మోసమే ఇప్పుడు ఎన్సీపీ ని అజిత్ పవార్ చేసారని వ్యాఖ్యానిస్తున్నారు. 1978లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఆయన అప్పుడు కార్మిక శాఖా మంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు గా చీలిపోయి పోటీ చేసాయి.

అయినా సరే రెండు పార్టీలు కలిసి ఉమ్మడి ఒప్పందంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇక అప్పటి ఎన్నికల్లో ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనతా పార్టీకి పవార్ అనూహ్యంగా మద్దతు ఇచ్చారు. అప్పటి వరకు ముఖ్యమంత్రి వద్ద నమ్మకంగా ఉన్న ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ లోని కొందరు ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి… ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి స్థాపించి జనతా పార్టీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 38 ఏళ్ళ వయసులో ప్రమాణ స్వీకారం చేసారు. సరిగా ఇప్పుడు అదే జరిగింది… శరద్ పవార్ వెంట నమ్మకంగా ఉండే… అజిత్ పవార్ ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news