మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలు భారీ బహిరంగ సభలు పెట్టాయని కానీ గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో ఒక్కరు కూడా చెప్పలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. భాజపా, తెరాస బహిరంగ సభలు రెండూ రాజకీయాల చుట్టే తిరిగాయని.. సామాన్య ప్రజల సమస్యలపై ఒక్కరూ ప్రస్తావించలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌తో మళ్లీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని అన్నారు.
బహిరంగ సభల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొనేందుకే పరిమితం అయ్యారని మల్లు రవి దుయ్యబట్టారు. ఎన్నికల హామీల అమలు ప్రస్తావన ఎక్కడా రాలేదన్నారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదనే భాజపా, తెరాస పరస్పరం తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని మోదీ, అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మల్లు రవి ప్రశ్నించారు.
‘‘బహిరంగ సభలకు జనం వచ్చినంత మాత్రాన ఓట్లు రావు. కేసీఆర్ మునుగోడులో సెంటిమెంట్‌తో గెలవాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు మునుగోడుకు చేసిందేమిటో సీఎం ఎందుకు చెప్పలేకపోతున్నారు? భాజపా, తెరాస నేతలు అక్రమాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దేశాన్ని మోదీ.. రాష్ట్రాన్ని కేసీఆర్.. అప్పుల కుప్పగా మార్చారు. అవినీతి, అక్రమాలు చేసిన వారు జైల్లో ఉండాల్సిన సమయం వచ్చింది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదు’’ అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.