రోజాకు క్లారిటీ.. నగరిలో డౌటేనా?

ఏ అధికార పార్టీకైనా నిదానంగా ప్రజా వ్యతిరేకత పెరగడం సహజమే..ఏదో మొదట్లో అంతా బాగానే ఉంటుంది గాని…రెండేళ్ళు, మూడేళ్లు ఇలా సమయం గడిచే కొద్ది కాస్త ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..ఇక నాలుగేళ్లకు, ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి..అయితే అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రజా వ్యతిరేకతని పసిగట్టి, ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు చేయాలి..అలా కాకుండా తాము అధికారంలో ఉన్నామని చెప్పి, తమకు ఇంకా తిరుగులేదని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని అనుకుంటే బోల్తా కొట్టేస్తారు..2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూడా ఇలాగే ప్రజా వ్యతిరేకతని పసిగట్టడంలో విఫలమైంది..ఫలితంగా 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీపై కూడా కాస్త ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే చెప్పాలి. అలా అని టీడీపీ నేతలు చెప్పేంత వ్యతిరేకత కాదు..అలాగే ప్రజలంతా తమకే మద్ధతుగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నట్లు కూడా పరిస్తితి లేదు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్తితుల్లో వైసీపీపై మాత్రం ప్రజా వ్యతిరేకత ఉంది…ఇది వైసీపీ నేతలు గుర్తించి ప్రజల్లో వ్యతిరేకతని పోగొట్టే కార్యక్రమాలు చేయాలి. ఈ విషయంలో మంత్రి రోజా కాస్త క్లారిటీగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా మూడు సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత సహజంగానే వస్తుందని, అయితే దీనిని తెలుసుకుని, సరిదిద్దుకునేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తుందని రోజా అంటున్నారు.

అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది..వ్యతిరేకతని రోజా గుర్తించారు..అలాగే దాన్ని సరిచేస్తామని అంటున్నారు..కానీ రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో ఉన్న ప్రజా వ్యతిరేకతని గుర్తించారా? లేదా? అని విశ్లేషకుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే వరుసగా రెండుసార్లు గెలిచిన రోజాకు ఇప్పుడు నగరిలో కాస్త వ్యతిరేకత ఉంది…అసలు సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. కాబట్టి ఆ వ్యతిరేకతని సరిచేసుకోవాల్సిన బాధ్యత రోజాపై ఉందని, లేదంటే నగరిలో రోజా గెలుపు డౌటే అంటున్నారు.