టీఆర్ఎస్‌లో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే

-

డోర్నకల్‌ రాజకీయాలు వేడెక్కాయి. చిరకాల ప్రత్యర్థులైన మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఎవరి దారి వారిదే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటమే కాకుండా, వర్గ రాజీకీయాలను పెంచిపోషిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సత్యవతి రాథోడ్‌కు అధిష్ఠానం మంత్రి పదవి ఇచ్చిన నాటి నుంచి ఇద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మంత్రి వద్దకు వెళ్లవద్దని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన వర్గీయుల‌కు హుకుం జారీ చేశార‌ని పార్టీ నేత‌ల్లో చ‌ర్చ సాగుతోంది.

గ‌త నాలుగు నెల‌లుగా ప్ర‌తి అభివృద్ధి కార్య‌క్ర‌మంలోనూ ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య వార్ న‌డుస్తూనే ఉంది.
ఇటీవల కార్తీక పౌర్ణమి రోజున నియోజకవర్గ పరిధిలోని కందగిరి జాతరకు ఇద్దరు కలిసి అక్కడకు చేరుకోవాల్సి ఉన్నా.. వేర్వేరుగా దర్శనం చేసుకోవడం, పూజలు నిర్వహించడం గమనార్హం. ఏ కార్య‌క్ర‌మంలో అయినా వీరిద్ద‌రు తార‌స‌ప‌డితే ఎడ‌మొఖం పెడ‌మొఖంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ ఆగలేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని నియోజకవర్గకార్యకర్తలు వాపోతున్నారట.

టీఆర్ఎస్ అధిష్ఠానం ఎంత స‌ర్ది చెప్పినా..స‌రే అన‌డ‌మే గాని ఆచ‌ర‌ణ‌లో మాత్రం త‌మ‌ప‌ని తాము చేసుకుంటూ వెళ్తూ టీఆర్ ఎస్‌లో చీలిక‌ను స్ప‌ష్టంగా చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో సత్య‌వ‌తి టీఆర్ ఎస్ నుంచి పోటీ చేయ‌గా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రెడ్యా ఆమెపై విజ‌యం సాధించారు. 2009 ఎన్నిక‌ల్లో రెడ్యాపై టీడీపీ నుంచి పోటీ చేసిన స‌త్య‌వ‌తి గెలిచింది. ఇలా దాదాపు రెండు ద‌శాబ్దాలుగా వీరిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ యుద్ధం సాగుతోంది. పైగా వీరిద్ద‌రు వ‌రుస‌కు వియ్యంకుడు, వియ్య‌పురాలు అవుతారు.

2014 త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి. త‌న కూతురు మానుకోట మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత ఎంపీ క‌విత‌తో క‌ల‌సి రెడ్యా కారెక్కారు. డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో స‌త్య‌వ‌తి ప్రాబ‌ల్యం త‌గ్గిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో సిట్టింగ్‌ల‌కే సీట్లు నినాదంతో కేసీఆర్ రెడ్యాకే డోర్న‌క‌ల్ టికెట్ ఇచ్చారు. దీంతో ఇక స‌త్య‌వ‌తి రాజ‌కీయ జీవితం ముగిసిన‌ట్లేన‌ని అనుకుంటున్న స‌మ‌యంలో కేసీఆర్ పిలిచి మ‌రీ ఎమ్మెల్సీని చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా మంత్రివ‌ర్గంలోనూ చోటు క‌ల్పించారు. దీంతో స‌హ‌జంగానే రెడ్యాకు రాజ‌కీయంగా మింగుడుప‌డ‌టం లేదు. సీనియ‌ర్‌గా ఉన్న త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో ఆయ‌న స‌త్య‌వ‌తిపై త‌న అక్క‌సంతా చూపిస్తున్నారు.

కూతురుకు ఎంపీ, త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌డంతో రెడ్యాకు ఏం చేయాలో అర్థం కాక మిన్న‌కుండిపోతున్నార‌ట‌. అయితే స‌త్య‌వ‌తిని మాత్రం డోర్న‌క‌ల్‌లో పుంజుకోకుండా చేయాల‌న్న‌ది ఆయ‌న వ్యూహంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక అదే స‌మ‌యంలో వ‌చ్చే ఐదేళ్ల నాటికి ఆయ‌న రాజ‌కీయాల్లో ఉండ‌టం అసాధ్య‌మే అన్న‌ది నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్న మాట‌. వ‌స్తే గిస్తే ఇప్పుడే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రావాలి… లేక‌పోతే ఆయ‌న‌కు ఇక మంత్రి ప‌ద‌వి రాన‌ట్టే..! వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రెడ్యా త‌న కొడుకును రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకునేలా చేసి… కొడుకు ర‌విచంద్ర‌కు టికెట్ ద‌క్కేలా చేసేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

అయితే స‌త్య‌వ‌తికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఖాయ‌మ‌ని ఆమె వ‌ర్గీయులు ఇప్ప‌టి నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో హ‌డావుడి చేయ‌డం రెడ్యాకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంద‌ని స‌మాచారం. అయితే ఇదిలా ఉండ‌గా ఎంపీ క‌విత రెడ్యాకు మ‌ద్ద‌తిస్తూనే..స‌త్య‌వ‌తితో చ‌నువుగా తిరుగుతుండ‌టం కొస‌మెరుపు. స‌త్య‌వ‌తితో అత్యంత చ‌నువుగా ఉండే మ‌హిళ‌ల్లో క‌విత ఒక‌రు కావ‌డం విశేషం. చూడాలి డోర్న‌క‌ల్ రానున్న కాలంలో ఎలాంటి రాజ‌కీయం జ‌రుగుతుందో..?!

Read more RELATED
Recommended to you

Latest news