ఏపీ బీపీ : మ‌రో వివాదంలో మోడీ … కేసీఆర్ క‌లిసి వ‌స్తారా ?

-

నీటి యుద్ధాలు ఓ వైపు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అన్న‌ది ఓ ప్ర‌క్రియ‌గానే సాగుతోంది. అదృష్టం ఏంటంటే భారీ వ‌ర్షాల కార‌ణంగా ఎగువ ప్రాజెక్టుల నుంచి వ‌రద నీరు ఏటా మ‌న ప్రాంతాల‌కు చెందిన ప్రాజెక్టుల్లోకి చేర‌డం. అదే క‌నుక జ‌ర‌గ‌కుంటే యుద్ధాలు ఇంకొంత తీవ్ర‌త‌రం అయ్యే వీలుంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో క‌ర్ణాట‌క కేంద్రంగా మ‌రో నీటి యుద్ధం జ‌ర‌గ‌నుంది. ఎగువ భ‌ద్ర (అప్ప‌ర్ భ‌ద్ర‌) ప్రాజెక్టు పూర్త‌యితే రెండు తెలుగు రాష్ట్రాల‌కూ ఇబ్బందే అని తేలిపోయింది.

కానీ ఎటువంటి కేటాయింపులూ లేకుండానే తుంగ‌భ‌ద్ర జ‌లాలు 29.9టీఎంసీలు వాడుకునేందుకు కేంద్రం అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యాన త‌గువు మ‌రింత తీవ్రత‌రం కానుంది. అనుమ‌తులే కాకుండా ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా క‌ల్పించింది. వీటినే ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ప్రాంతీయ స‌దస్సులో లేవ‌నెత్తాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.

పోరు స‌రే.. బోర్డు మాటేంటి ?

ఇప్ప‌టికే కృష్ణా న‌దిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌పై కేంద్రం బోర్డు వేసిన‌ప్ప‌టికీ, ఆ త‌గాదా ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తీర‌లేదు. బోర్డు నిర్వ‌హ‌ణ‌కు రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెల్లించాల్సిన మొత్తాలేవీ చెల్లించ‌లేదు. దీంతో ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు చెల్లించాల్సిన ఏ నిధులు ఒక్క పైసా కూడా మ‌న రాష్ట్రాలు చెల్లించలేదు. ఇప్పుడు మాత్రం రెండూ ఒక్క‌టై క‌ర్ణాట‌కు నిల‌దీస్తామ‌ని చెబుతున్నాయి. ఓ విధంగా జ‌ల‌వివాదం ఇప్ప‌ట్లో తేలేలా లేదు. ప్రాజెక్టు పూర్తయితే శ్రీ‌శైలంకు చేరుకునే వ‌ర‌ద నీటి ప్ర‌వాహం కానీ తుంగ‌భ‌ద్ర డ్యాంకు చేరే వ‌రద ప్ర‌వాహం కానీ గ‌తంలో మాదిరిగా ఉండ‌దు.

క‌నుక‌నే రెండు తెలుగు రాష్ట్రాలూ ఆందోళ‌న చెందుతూ నీటి పంచాయితీ ని కేంద్రం దృష్టిలో ఉంచాల‌ని చూస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో కృష్ణా జ‌లాల‌కు సంబంధించి బోర్డు ప‌రిధి నిర్ణ‌యం అయి ఉన్నందున దానిపై కూడా ఓ స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఇరు రాష్ట్రాల‌కూ ఉంది. ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు ప‌ట్టింపు అన్న‌ది లేకుండా ఉండ‌డం కూడా స‌బ‌బు కాదు. కొత్త ప్రాజెక్టును అడ్డుకోవ‌డం మంచిదే కానీ ఇదే స‌మ‌యాన పాత ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ అన్న‌ది గాలికి వ‌దిలేయ‌డం కూడా భావ్యం కాదు.

ఇక అప్ప‌ర్ భ్ర‌ద‌కు సాంకేతిక అనుమ‌తి ఇవ్వాలంటే బేసిన్ ప‌రిధిలో మ‌హారాష్ట్ర‌, ఏపీ, తెలంగాణల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. ఆ విధంగా క‌ర్ణాట‌క స‌ర్కారు చేప‌డుతున్న ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టిదాకా ఏ అభిప్రాయం సేక‌రించ‌లేద‌ని ఏక‌రువు పెడుతోంది. ఇది ఎంత మాత్రం భావ్యం కాద‌ని నిపుణులు సైతం చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news