సొంత పార్టీ నేతల పై ఒక్కో అస్త్రం ఎక్కుపెడుతున్న వైసీపీ ఎంపీ

-

పెద్దల సభకు వెళ్లినా ఆ ఎంపీగారి దృష్టంతా లోకల్ పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతుంది.ఏదో ఓ బాంబు పేలుస్తూ సొంత పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లా వైసీపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌. సొంత పార్టీ నాయకులపై ఆయన ఎక్కుపెడుతున్న అస్త్రాలు కలకలం రేపుతున్నాయి. పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం చేస్తున్నారా లేక జిల్లాలో పట్టు సాధించే ప్రయత్నంలో దూకుడుగా వెళ్తున్నారో అర్థం కాక సతమతమవుతున్నారు సొంత పార్టీ కేడర్.

మొన్న తోట త్రిమూర్తులు.. నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలతో బోస్ కయ్యానికి కాలు దువ్వడాన్ని ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి గోదావరిజిల్లా పార్టీ వర్గాలు. తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. మండపేటకు పార్టీ ఇంఛార్జ్‌ కూడా. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు ఎప్పటి నుంచో రాజకీయ ప్రత్యర్థి. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో.. పాత గొడవలు మర్చిపోతారని అంతా భావించారు. కానీ..23 ఏళ్ల క్రితం జరిగిన శిరోముండనం కేసు విచారణను వేగంగా పూర్తి చేయాలని హోంమంత్రికి లేఖరాశారు బోసు. ఈ కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. తోటను లక్ష్యంగా చేసుకునే బోసు ఆ లేఖ రాశారని అంతా చర్చించుకున్నారు.

తోటకు వ్యతిరేకంగా రాసిన లేఖపై జిల్లాలో చర్చ జరుగుతున్న సమయంలోనే.. మరో వివాదానికి ఆజ్యం పోశారు బోసు. కాకినాడలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీకే చెందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై ఆయన అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ప్రత్యర్ధి పార్టీ నాయకుల కంటే తీవ్రంగా ఇద్దరూ దూషించుకున్నారు. నీ సంగతి నాకు తెలుసులే అంటే నీ సంగతి నాకు తెలుసులే అని మాటలు, బూతులతో సమావేశాన్ని వేడెక్కించారు. డీఆర్సీ మీటింగ్‌ పూర్తయినా ద్వారంపూడి, బోసు మధ్య మాటల యుద్ధం ఆగలేదంటే ఏ స్థాయిలో గొడవ పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

సొంత పార్టీకి చెందిన తోట త్రిమూర్తులు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని ఎందుకు ఎంపీ బోసు లక్ష్యంగా చేసుకున్నారో అన్న చర్చ మొదలైంది. ఏదైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా తేల్చుకోవాలి తప్ప బహిరంగంగా లేఖలు రాయడం.. రచ్చకెక్కడం ఎంత వరకూ సబబు అని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారట. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేయడమంటే అది అధికార పక్షానికీ ఇబ్బందే అని అనుకుంటున్నారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పార్టీకి కొత్త కాదు.. వైసీపీ పెట్టినప్పటి నుంచి సీఎం జగన్‌ వెంట ఉన్నారు. అన్నీ తెలిసిన ఆయన ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదని చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో బోసు ఓడిపోయినా.. పిలిచి డిప్యూటీ సీఎంను చేశారు సీఎం జగన్‌. శాసనమండలి రద్దుకు సిఫారసు చేసిన సమయంలో మంత్రి పదవులకు రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. అయితే సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం బోసుకు నచ్చలేదన్న ప్రచారం కూడా ఉంది. రాజ్యసభకు పంపించడం ద్వారా తనను రాష్ట్ర ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేశారనే భావనలో ఉన్నారట. అందుకే జిల్లాలో తన ఉనికిని చాటుకోవడం కోసం.. సొంత పార్టీ నేతలనే టార్గెట్‌ చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news