ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..వైసీపీలో ఆగని పోరు?

ఏపీలోని అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే కనిపిస్తుంది..వైసీపీ అధిష్టానం ఈ పోరుకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది గాని..ఎక్కడొక చోట మళ్ళీ రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే పలు స్థానాల్లో సొంత నేతల మధ్యే పోరు తీవ్రంగా నడుస్తోంది. అవసరమైతే కొందరు పార్టీని ఓడించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అటు కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలకు-ఎంపీకి పొసగని పరిస్తితి కనిపిస్తోంది. మొదట నుంచి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరిలకు పడని విషయం తెలిసిందే. మచిలీపట్నంలో ఎవరి గ్రూపు వారికే ఉంది. అలాగే ఎంపీని ఎక్కడకక్కడ నిలువరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎంపీ తన సొంత బలగంతో ముందుకెళుతున్నారు.

పేర్ని నాని-ఎంపీ బాలశౌరి వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్.. అనవసర రచ్చ వద్దని వార్నింగ్

ఇక ఎంపీతో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో సైతం విభేదాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల నాగాయలంకలో నాబార్డ్ చైర్మన్ షాజీ సమక్షంలో ఎంపీ బాలశౌరి అనుచరుడు గరికపాటి శివపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. శివ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ క్రమంలోని నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మేనల్లుడు రేపల్లె దామోదర్ సహా నలుగురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నలుగురిని అరెస్టు చేసి వెంటనే పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు.

ఇక తమ అనుచరులను స్టేషన్‌కు తరలించడంపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసి…తెల్లవారుజాము సమయంలో ఎమ్మెల్యే వర్గీయులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి హడావిడి చేశారని తెలిసింది. ఇలా ఎంపీ-ఎమ్మెల్యే వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం పరిధిలో వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.