కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు.కిర్లంపూడిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడతే తాను ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని తేల్చిచెప్పారు.తాను ఎలాంటి పదవులు ఆశించకుండా వైసీపీ కండువా కప్పుకుంటున్నానని పేర్కొన్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.వారి ఆహ్వానం మేరకు వైసీపీలోకి వెళ్తున్నానని స్పష్టం చేశారు.
ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో సీనియర్ నాయకుడు.గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1983, 1985లో టీడీపీ తరఫున బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు.1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు.అదే పార్టీ నుంచి 1994లో పోటీ చేసి ఓడిపోయారు.ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పని చేసిన అనుభవం ఆయనుకుంది.1999లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ….ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఇటీవల జనసేనకు 24 అసెంబ్లీ సీట్లనే కేటాయించడాన్ని ముద్రగడ తప్పుబట్టారు.దీనిపై పవన్‌కళ్యాణ్‌కి ముద్రగడ లేఖ రాశారు.జనసేన తక్కువ సీట్లు తీసుకుందన్నారు. పవర్ షేరింగ్ కోసం ఇంకొన్ని సీట్లు తీసుకుంటే బాగుండేదని ఆ లేఖలో ప్రస్తవించారు.దీంతో ముద్రగడ జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది.అయితే ఆ పార్టీ నేతల నుంచి ఆహ్వానం రాకపోవడంతో హర్ట్ అయ్యారు.ఆ తరువాత వైసీపీ నేతలు ముద్రగడతో భేటీ అయ్యారు.
పార్టీలో చేరికపై ఆయనతో చర్చించారు.దీంతో వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు.ఇదే క్రమంలో తేదీని కూడా ఆయన మీడియాముఖంగా ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం సీఎం సమక్షంలో వైసీపీ ఖండువా కప్పుకుంటామని స్పష్టం చేశారు.ప్రస్తుతానికి వైసీపీ విజయం కోసం ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు. పార్టీ అదికారంలోకి వచ్చాక ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తామని వెల్లడించారు. అయితే ఆయనకు పిఠాపురం టిక్కెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. మరి సీఎం జగన్…ముద్రగడ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.