ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ పదవులిస్తున్నారు : మైనంపల్లి

-

మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. పదవులు వచ్చిన వాళ్లకే మళ్లీ వస్తున్నాయని మండిపడుతున్నారు. ఒక్కో వ్యక్తి మూడు, నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీలో పదవులపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, వివేకానందగౌడ్​.. దూలపల్లిలోని ఎమ్మెల్యే హన్మంతరావు ఇంట్లో భేటీ అనంతరం ఈ మేరకు మాట్లాడారు.

తన కుమారుడైనా.. సమర్థంగా పనిచేస్తేనే పదవులు వస్తాయని హన్మంతరావు వెల్లడించారు. తన కుమారుడిని బలవంతంగా రాజకీయాల్లోకి తేవటం లేదని చెప్పారు. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు రావాలనే.. ఇప్పుడు డిమాండ్​ చేస్తున్నామని వివరించారు. కొన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే కలిసి మాట్లాడుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

కొందరు మంత్రులు వాళ్లకు సంబంధించిన వ్యక్తులకే నాలుగేసి పదవులు ఇప్పించుకుంటున్నారని హన్మంతరావు ధ్వజమెత్తారు. నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలు తమను నిలదీస్తున్నారన్నారు. మంత్రుల వ్యక్తులకే పదవులు ఇచ్చి.. ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు కారణమే మంత్రి మల్లారెడ్డి అయితే మళ్లీ ఆయనను ఎలా పిలుస్తామని చెప్పారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తే తాము కూడా అభినందిస్తామన్న ఆయన.. తాను కేవలం మేడ్చల్ నియోజకవర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news