గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం అంటే అక్కడ ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడకుండా ఉండలేమనే చెప్పాలి. ఎందుకంటే పాతబస్తీలో ఎంఐఎం హవా ఎక్కువ. గ్రేటర్ లో 7 సీట్లు ఎంఐఎం కంచుకోటలు…చాంద్రాయణగుట్ట, ఛార్మినార్, మలక్‌పేట, నాంపల్లి, బహదూరపురా, యాకుత్‌పురా, కార్వాన్ సీట్లు మజ్లిస్ కంచుకోటలు. ఈ ఏడు స్థానాల్లో వరుసగా గెలుస్తూనే ఉంది.
అయితే ఈ సారి కూడా ఏడు స్థానాల్లో ఎంఐఎం సత్తా చాటుతుందా? అంటే అందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. మళ్ళీ 7 గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 6 స్థానాల్లో మజ్లిస్‌కు ఏ పార్టీతోనూ పెద్దగా పోటీ లేదు..బిఆర్‌ఎస్, బిజేపి, కాంగ్రెస్ పార్టీలు పోటీ ఇవ్వలేవు. కానీ ఒక్క నాంపల్లి సీటులోనే పోటీ ఉంది. ఇక్కడ మజ్లిస్‌కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది.
వాస్తవానికి గత మూడు ఎన్నికల నుంచి ఒక్క అభ్యర్ధి..ఎంఐఎం పార్టీకి పోటీ ఇస్తున్నారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు..దీంతో కాంగ్రెస్ పోటీ ఇస్తుంది. ఇక అలా నాంపల్లిపై పట్టున్న నేత ఎవరో కాదు. మహమ్మద్ ఫిరోజ్ ఖాన్..గత మూడు ఎన్నికల నుంచి ఈయన విజయం కోసం పోరాడుతున్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి..ఎంఐఎం చేతిలో 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2014లో టిడిపి నుంచి బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి..మళ్ళీ 6 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగి 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలా మజ్లిస్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోతూ వస్తున్నారు. అయితే ఈ సారి కూడా ఆయన కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్నారు. వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఉంది. దీంతో నాంపల్లి ప్రజలు ఈ సారి ఫిరోజ్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ అది మజ్లిస్ అడ్డా కాబట్టి ఈ సారి కూడా పోరు గట్టిగానే ఉంటుంది. మరి ఈ సారి నాంపల్లి ఎవరి సొంతమవుతుందో చూడాలి.