వైసీపీలో ఉప్పు – నిప్పు మ‌రింత పెరుగుతుందా…?

-

చ‌ర్య‌ – ప్ర‌తిచ‌ర్య కామ‌న్ అయిన రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామ‌మైనా జ‌రిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా ఆధిప‌త్య పోరుతో అట్టుడుకుతున్న క‌ర్నూలు జిల్లా నందికొట్కూరులో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ త‌న‌దైన మార్కు రాజ‌కీయ ప‌రిష్కారం చూపించారు. ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ సూచించిన వారికి నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టి.. వేరేవారికి ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్గానికి అనుకూలంగా ఉన్న‌వారికి జ‌గ‌న్ క‌రుణ చూపించారు. ఇది ప్ర‌స్తుతానికి మంట‌ను చ‌ల్లార్చుతుంద‌ని అనుకున్నా.. దీర్ఘ‌కాలంలో చూస్తే.. నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య‌హోరు, జోరు మ‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

నందికొట్కూరు మార్కెట్ కమిటీ పదవులు మాకు రానందుకు బాధ లేదని, పదవులు వచ్చిన వారికి కంగ్రాట్స్ చెప్పిన ఎమ్మెల్యే ఆర్థ‌ర్ పైకి మాత్రం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలే శిరోధార్యమ‌ని ప్ర‌క‌టించారు. నందికొట్కూరు నియోజక వర్గంలో అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయ‌ని, అయినా కొంద‌రు త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ప‌రోక్షంగా బైరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో త‌న అనుచరులకు మార్కెట్ కమిటీ పదవులు రాలేదని బాధగా ఉంద‌న్నారు. మనస్తాపాని కి గురైన మాట వాస్తవమేన‌న్నారు. పదవులు అనేది కొందరికేన‌ని, అందరికీ రావని త‌న వారికి వివ‌రించిన‌ట్టు చెప్పారు. అయితే, ఏ నాయ‌కుల మ‌ద్య అయినా.. విభేదాలు ఒక‌సారి త‌లెత్తితే.. అవి పోవ‌డం అంత తేలిక కాదు.

2014లో నందికొట్కూరు టికెట్ ఇస్తానన్న‌ సీఎం జగన్ ఆర్ధ‌ర్‌కు ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో పిలిచి టికెట్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇక్క‌డ పార్టీ కోసం కృషి చేశారు. జ‌గ‌న్ అంటే అమిత‌మైన అభిమానం కురిపించే ఆర్ధ‌ర్‌కు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కినా.. అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో నిద్ర‌లేని ప‌రిస్థితి ఎదురైంది. ఇక్క‌డ పార్టీ ఇంచార్జ్‌గా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నియామ‌కంతో ఆయ‌న డోలాయ‌మానంలో ప‌డ్డారు. ప్ర‌తి విష‌యంలోనూ బైరెడ్డి ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శించారంటూ.. గ‌తంలోనే ఆర్థ‌ర్ విమ‌ర్శ‌లు సంధించారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా..త‌న‌కు ఇక్క‌డ స్వ‌తంత్రం లేకుండా పోయింద‌ని కూడా అన్నారు. ఈ నేప‌థ్యంలో ఇరువురి మ‌ధ్య తీవ్ర వివాదం న‌డిచింది. ఎట్ట‌కేల‌కు ఇది జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరింది. అయితే, ఆయ‌న బైరెడ్డి వైపే మొగ్గు చూప‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ ఇక్క‌డ ఆధిప‌త్య రాజ‌కీయం మ‌రింత పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news