కొత్త టెన్షన్ లో జనసైనికులు… విముక్తి ప్రసాధించు గోపాలా?

-

సినీనటుడు బయట ఎక్కువగా కనబడకూడదు.. రాజకీయ నాయకుడు ఎక్కువగా దాగకూడదు అంటారు! ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఈ సూత్రం తెలిసో తెలియకో కానీ.. రివర్స్ లో అప్లై చేస్తున్నారు. సినీనటుడిగా ఉన్నప్పుడు పెద్దగా ఫంక్షన్స్ కి గట్రా వచ్చేవాడు కాదు పవన్. అది ఆ రంగంలో కరెక్టే కావొచ్చు.. అదోరకం వ్యూహం కావొచ్చు. కానీ.. ఒక్కసారి ప్రజాసేవలోకంటూ దిగిన తర్వాత ప్రజలకు నిత్యం టచ్ లో ఉండాలి.. ప్రజలకు సంబందించిన ప్రతీ విషయంలోనూ స్పందించే లక్షణం కలిగి ఉండాలి.. ఇది ప్రైమరీ విషయం కూడా! కానీ పవన్ ఇది మరిచాడు.. ప్రజారాజ్యాన్ని గుర్తు చేస్తూ జనసేన కార్యకర్తలను కొత్త టెన్షన్స్ కి గురిచేస్తున్నాడు.

2014 సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలి.. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ని టార్గెట్ చేసినప్పుడే.. పవన్ రాజకీయ అవగాహనపైనా, రాజకీయాల్లో తాను ఏస్థాయిలో రాణించగలడు, రాజకీయాల్లోకి ఏ స్థాయి వ్యూహాలతో వచ్చాడు అనే విషయంపైనా ఒక క్లారిటీ వచ్చి ఉండాల్సింది.. అని అంటున్నారు కొందరు జనసైనికులు. రావడం రావడమే అధికారపార్టీకి ఎప్పుడైతే వంతపాడటం మొదలుపెట్టారో.. అప్పుడే ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలను చంపేసుకున్నట్లే అని ఒకవాదన వినిపిస్తుంది. ఎందుకంటే… ఒక వ్యక్తి రాజకీయాల్లో రాటుదేలాలంటే, ప్రజలకు మరింత చేరువ కావాలంటే, సొంతంగా తనకంటూ ఒక ఐడెంటిటీ కల్పించుకోవాలంటే ప్రతిపక్షపాత్ర పోషించడానికి మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు.

ఆ సంగతులు అలా ఉంటే… కరోనా వచ్చినదగ్గరనుంచి పవన్ పూర్తిగా స్పందించడం మానేశాడనే చెప్పాలి. కరోనా సమయంలో ఒకటి రెండు ట్వీట్లు.. తాజాగా పరీక్షల రద్దు గురించిన ప్రస్థావనలు మినహా మరో స్పందన పవన్ నుంచి లేదు! ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాతావరణం రోజు రోజుకీ వేడెక్కిపోతూఉంది. ప్రతిపక్షాలకు చెందిన నేతల అరెస్టులు, అధికారపక్ష నేతలపై విమర్శలు, నిమ్మగడ్డ వ్యవహారం, కరోనా సమయంలో ప్రజలకు అందుతున్న సహకారం… ఇలా స్పందించే లక్షణం ఉండాలే తప్ప… పవన్ స్పందించడానికి బోలెడన్ని టాపిక్కులు… అయినా కూడా కళ్యాణ్ బాబు స్పంందించడం లేదు! బీజేపీతో కలిశిన తర్వాత.. ఏపీ బీజేపీ నేతలు స్పందిస్తున్న విషయాలపై, పోని వారి అనుమతితో అయినా స్పందించి ఉంటే బాగుంటుంది.. అది కూడా చేయడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఇవ్వడం లేదా పవన్ కే మనసు రావడం లేదా? జనసైనికులకు అర్ధం కావడం లేదు పాపం!

అధినేత ప్రవర్తన అలా ఉండటంతో.. చాలా నియోజకవర్గాల్లో జనసైనికులు కొందరు వైకాపా వైపు, మరికొందరు టీడీపీ వైపు.. ఎవరి అనుకూలత మేర వారు జారుకుంటున్నారు! దానికి పవన్ మౌనమే కారణం అనే కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… 2019 ఎన్నికల్లో తనను నమ్మి పడిన 6శాతం ఓట్లకైనా పవన్ గౌరవం ఇవ్వాలి.. వారి తరుపున ప్రశ్నించాలి.. పోరాడాలి. కానీ లేదు… మౌనమే పవన్ సమాధానం.. హడావిడి చేసినంత సేపు లేకుండా మూగబోయిన “ప్రశ్న”! ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అన్న పవన్… నేడు ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వంలో ఏమీ లేదని మౌనంగా ఉంటున్నారా.. లేక తనవద్ద ఉన్నవి, ఇతరులు రాసిచ్చినవి అన్ని ప్రశ్నలూ ఐపోయాయా? జనసైనికుల మరో డౌట్ ఇది!

దీంతో… పవన్ పద్దతిని గత కొంతకాలంగా గమనిస్తున్న జనసైనికులు… ఇది మరో ప్రజారాజ్యమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంట. ప్రజారాజ్యం.. కాంగ్రెస్ లో కలిసిపోతే…. జనసేన.. బీజేపీలో కలిసిపోబోతోందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. అన్నయ్యలాగే తమ్ముడు కూడా జనసేనను విలీనం చేసి కాడి వదిలేస్తాడని అంటున్నారు. తన భవిష్యత్తు అయితే ఆయన చూసుకుంటున్నాడు.. మరి కేడర్ పరిస్థితి ఏమిటి? మరోసారి మోసపోవడమే మా వంతా అని జనసైనికులు ఆవేదన చెందుతున్నారంట.

ఈ సమయంలో వ్యవహారం ముదిరే వరకూ, అనుమానాలు బలపడేవరకూ ఆగకుండా… పవన్, జనసైనికులకు ఒక క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు విశ్లేషకులు. ఈ కొత్త టెన్షన్ నుంచి జనసైనికులకు, గోపాలుడు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నారు!! మరి ప్రశ్నించే పవన్.. కార్యకర్తలకు సమాధానాలు చెబుతాడా? వెయిట్ అండ్ సీ!!

Read more RELATED
Recommended to you

Latest news