వైఎస్ ఫ్యామిలీలో కొత్త ట్విస్ట్..తెలంగాణని వదలరా?

దివంగత వైఎస్సార్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానిస్తారు. ఇక వైఎస్‌ ఇమేజ్‌ని ఏపీలో వైఎస్ జగన్ బాగానే వాడుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీ పెట్టి ఒకసారి ఓడిపోయిన, మరొకసారి గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏపీని జగన్ పాలిస్తున్నారు.

అయితే జగన్ పెట్టిన వైసీపీ తెలంగాణలో క్లోజ్ అయింది. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి వైఎస్సార్ తనయురాలు, జగన్ సోదరి షర్మిల, ఇక్కడ వైఎస్సార్టీపీ పేరిట పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. కాకపోతే జగన్‌తో విభేదించి షర్మిల పార్టీ పెట్టారో లేక, పరోక్షంగా అన్న మద్ధతు తీసుకుని పార్టీ పెట్టి పెట్టారో ఎవరికి క్లారిటీ రావడం లేదు. కానీ ప్రస్తుతానికైతే షర్మిల జగన్‌తో సంబంధం లేకుండానే పార్టీ పెట్టినట్లు కనిపిస్తోంది.

ఇలా తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల, నిదానంగా బలపడేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కొత్త కమిటీలని నియమిస్తున్నారు. తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం జరిగింది. ఇందులో తమ పేర్లు లేవని చెప్పి పలువురు కీలక నేతలు వైఎస్సార్టీపీకి రాజీనామా చేశారు. ఈ పదవులని కూడా డబ్బులకు అమ్ముకుంటున్నారని, పార్టీ నేత కొండా రాఘవరెడ్డి కనుసన్నలోనే ఇదంతా జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నేతలు రివర్స్ అయ్యారు. ఈ అసమ్మతి నేతలంతా తెలంగాణ రాజకీయాల్లోకి జగన్ భార్య భారతి రావాలని డిమాండ్ చేయనున్నారని తెలుస్తోంది. రావాలి భారతి-కావాలి భారతి పేరిట కార్యక్రమం నిర్వహించాలని చూస్తున్నారు. ఇలా వైఎస్ ఫ్యామిలీలో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు వస్తున్నాయి. మొత్తానికి వైఎస్ ఫ్యామిలీ తెలంగాణని వదిలేలా కనిపించడం లేదు.