ర‌ఘురామ ఎంట్రీతో పాత సీన్ రిపీట్‌…. ఉండి టీడీపీలో గంద‌ర‌గోళం

-

మూడు పార్టీల పొత్తుతో ఏపీ తెలుగుదేశం పార్టీలో గంద‌ర‌గోళం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోన‌వుతున్నారు.రఘురామ కృష్ణరాజు ఉండి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖ‌రారు కావ‌డంతో అక్క‌డి కేడ‌ర్ పార్టీకి దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయనను వైదొలగాల్సిందేనని చెప్పడంతో ఆయ‌న వెంట ఉన్న కేడ‌ర్ ఆవేద‌న చెందుతున్నారు.

బ‌రిలో నుంచి వైదొల‌గాల‌ని చంద్ర‌బాబు చెప్ప‌డంతో… నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో చర్చించారు రామ‌రాజు. తనను తప్పుకోమంటున్నారని అనుచ‌రుల వద్ద‌ క‌న్నీరు పెట్టుకున్నారు. గతంలో ఆయ‌న‌కు సీటు ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే పోయే అవకాశం ఉండటం క‌నిపిస్తోంది. గతంలో వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా ఉండేవారు. టీడీపీ తరపున ఆయ‌న రెండు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు చివరి క్షణంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేయడంతో శివరామరాజు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఉండి అభ్యర్తిగా శివరామరాజు సిఫారసు చేసిన రామరాజుకే చంద్రబాబు చాన్సిచ్చారు. అయితే శివరామరాజు ఓడిపోయారు. రామరాజు గెలిచారు. ఇప్పుడు తన సీటు తనకు ఇవ్వాలని కోరినా రామరాజు ఇవ్వలేదు. దాంతో రెబల్ గా శివరామరాజు బ రిలోకి దిగుతానని ప్రచారం చేసుకుంటున్నారు.

రఘురామకే టిక్కెట్ ఖరారు చేస్తే రామరాజు పోటీ నుంచి తప్పుకుంటారా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రఘురామకు, మాజీ ఎమ్మెల్యే శివకు మధ్య మెరుగైన సంబంధాలున్నాయి. ఒక వేళ రఘురామకు చాన్సిస్తే శివ మద్దతుగా ఉంటారని చెబుతున్నారు. ఆయన మద్దతు ఉంటే రామరాజు రెబల్ అయినా పెద్ద‌గా సమస్య రాదని అంటున్నారు. కానీ రఘురామ టీడీపీ అభ్య‌ర్ధిగా దిగితే.. అసంతృప్తులు ఇద్ద‌రూ రెబల్స్ గా పోటీ చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ ఆవిర్భవించాక 1983 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఒక 2004లో మినహా మిగిలిన అన్నిసార్లూ ఉండిలో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2009లో కాంగ్రెస్‌, 2019లో వైసిపి గాలి వీచినా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థులే గెలిచారు. మ‌రి ఈసారి ర‌ఘురామ సృష్టించిన గంద‌ర‌గోళం టీడీపీకి భారీ న‌ష్టాన్నే మిగిల్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news