గొట్టిపాటికి గోతులు తవ్వుతున్న సొంత పార్టీ నేతలు…!

-

గొట్టిపాటి రవికుమార్…. ప్రస్తుతం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు . 2004లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రవికుమార్… నాటి నుంచి ఓటమి ఎరుగని నేతగా నిలిచారు. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు తమ్ముని కుమారునిగా రాజకీయాల్లోకి వచ్చిన రవికుమార్… తన అన్న మాజీ గొట్టిపాటి నరసయ్య మాట కాదని… అద్దంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి అద్దంకి అంటే గొట్టిపాటి కేరాఫ్ అడ్రస్‌ అన్నట్లుగా మార్చుకున్నారు రవికుమార్.

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రవికుమార్… ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే అనూహ్యంగా 2016 చివర్లో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే సమయంలో టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న కరణం బలరామ్‌తో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. వరుసగా రెండు సార్లు కరణంపై ఎన్నికల్లో విజయం సాధించారు రవికుమార్. గొట్టిపాటి, కరణం మధ్య విభేదాలపై చంద్రబాబు కూడా స్వయంగా ఎన్నోసార్లు సయోధ్యకు యత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో గొట్టిపాటి అద్దంకి నుంచి పోటీ చేయగా… కరణం బలరామ్ చీరాల నుంచి టీడీపీ తరఫున ఎన్నికయ్యారు.

వ్యాపార రీత్యా గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారుతారనే పుకార్లు అప్పట్లో పెద్ద ఎత్తున షికారు చేశాయి. అయితే వీటిపై రవికుమార్ ఏ మాత్రం స్పందించలేదు. ఇక ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడులో వైసీపీని ఓడించడమే తన లక్ష్యమన్నారు. మరోసారి అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గొట్టిపాటి రవికుమార్ సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలే రవిని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ మరోసారి గెలిస్తే… వరుసగా ఐదోసారి గెలిచిన నేతగా రికార్డు సృష్టిస్తారు. ఇక పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకే మంత్రిపదవి ఖాయం కూడా. ఇదే సమయంలో బాపట్ల జిల్లా పరిధిలోని పర్చూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎన్నికైన ఏలూరి సాంబశివరావు, రేపల్లె నియోజకవర్గం నుంచి ఎన్నికైన అనగాని సత్యప్రసాద్ కూడా మూడోసారి ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే… మంత్రి పదవుల కోటాలో తమకు రవికుమార్ పోటీగా మారే అవకాశాలున్నాయని… అందువల్ల ఆయనను ఓడిస్తే… ఆయా సామాజిక వర్గాల జాబితాలో తమకే అమాత్య పదవి దక్కుతుందనే ఆలోచనలో ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ ఉన్నట్లుగా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్‌కు వ్యతిరేకంగా ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారనే పుకార్లు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున షికారు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news