ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ పోరు బాట పట్టింది. తెలంగాణలో యాసంగిలో పండించి వరి పంటను కొనుగోలు చేయాలంటూ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆందోళన కార్యక్రమాలను చేస్తున్నారు. ఉగాది తరువాత నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇప్పటికే ఈ నెల 4 తేదీన రాష్ట్రంలోని ప్రతీ మండలంలో నిరసన కార్యక్రమాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు.
కేంద్రం తీరుకు నిరసనగా ఈ రోజు రాష్ట్రంలోని 4 ప్రధాన రహదారులపై నిరసన చేయనున్నారు. హైవేల దిగ్భంధం చేయనున్నారు. నాగపూర్ జాతీయ రహదారిపై కడ్తాల్ మరియు ఆదిలాబాద్ వద్ద, బెంగళూరు జాతీయ రహదారిపై భూతపూర్ వద్ద, విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, చౌటుప్పల్ వద్ద, ముంబయి జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. హైవేలను దిగ్భంధించి రాష్ట్రం నిరసనను కేంద్రానికి తెలియజేయనున్నారు.