సరికొత్త వ్యూహంతో పరిటాల…కేతిరెడ్డికి చెక్ పడుతుందా?

ఏపీలో అధికార వైసీపీలో ఎక్కువ ప్రజా మద్ధతు గలిగిన ఎమ్మెల్యేల్లో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఒకరని చెప్పొచ్చు. నిత్యం ప్రజల్లో ఉండే ఈయనకు ప్రజల మద్ధతు ఎక్కువగా ఉంది. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యేగా కేతిరెడ్డి, రాష్ట్ర స్థాయిలో బాగా హైలైట్ అయ్యారు. గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి…మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా, నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వెంటనే అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కారం అయ్యేలా చేస్తున్నారు. ఇలా నిత్యం ప్రజల్లో ఉంటున్న కేతిరెడ్డికి తక్కువ సమయంలోనే ఏపీలో ఫాలోయింగ్ పెరిగింది. ఏపీలోనే కాదు పక్కనే ఉన్న తెలంగాణ ప్రజలు సైతం…ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనుకునే విధంగా కేతిరెడ్డి హైలైట్ అయ్యారు.

ఇలా అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న కేతిరెడ్డికి చెక్ పెట్టాలని టి‌డి‌పి యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ చూస్తున్నారు. అనంతలో పరిటాల ఫ్యామిలీకి ఎంత బలం ఉందో చెప్పాల్సిన పని లేదు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ గాలిలో బలంగా ఉన్న పరిటాల శ్రీరామ్ సైతం ఓడిపోయారు. రాప్తాడులో పోటీ చేసి ఈయన ఓటమి పాలయ్యారు. అయితే ధర్మవరంలో టి‌డి‌పి తరుపున పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ బి‌జే‌పిలోకి జంప్ అవ్వడంతో చంద్రబాబు, ధర్మవరం బాధ్యతలు కూడా పరిటాల ఫ్యామిలీకే అప్పగించారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో సునీతమ్మ…రాప్తాడులో, శ్రీరామ్…ధర్మవరం బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ధర్మవరంలో కేతిరెడ్డికి చెక్ పెట్టేందుకు శ్రీరామ్ సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. శ్రీరామ్ కూడా ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలని తెలుసుకుంటూ, పార్టీని బలోపేతం చేయడానికి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో శ్రీరామ్ పాదయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ పాదయాత్ర ద్వారా శ్రీరామ్, కేతిరెడ్డికి చెక్ పెట్టగలరేమో చూడాలి.