- కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరు
- జగన్ స్థానంలో నేనుంటే మరోలా ఉండేది
- ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా ఒక్కడినే పోరాడేవాడిని
- రాజకీయాల్లో అవినీతిని ఊడ్చేస్తా
- కేంద్ర మాజీ మంత్రి అవినీతిపై లోకేశ్ వైఖరేంటి?: పవన్
అమలాపురం: ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు భయపడుతూ.. ప్రజల పక్షాన పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్లలేని జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘నాకు ఒక్క ఎమ్మెల్యేనో, ఎంపీనో ఉంటే చట్టసభల్లోకి వెళ్లి నిలదీసేవాడిని. జగన్ స్థానంలో నేనుంటే.. నా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా నేనొక్కడినే అసెంబ్లీకి వెళ్లేవాడ్ని. అది కౌరవసభ అయినా నేను వెళ్తాను. అంత గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని’ అని జనసేనాని పేర్కొన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ‘జగన్‌పై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి కేసులున్నాయి.
ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే దమ్ము, ధైర్యం ఎక్కడిది? ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు జగన్ భయపడుతున్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా అవినీతి కేసుల నుంచి జగన్ తప్పించుకోలేరు’ అని పవన్ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే రూ.వెయ్యి కోట్లకు పైబడి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘అవినీతి రహిత పాలనకోసమే నేను పార్టీని స్థాపించాను. నా మతం ధర్మం, నా కులం రెల్లి. రాజకీయాలు అవినీతిమయంగా మారాయి. రెల్లి కులస్తులు చెత్తను ఎలా ఊడ్చేస్తారో.. అలా రాజకీయాల్లోని అవినీతిని ఊడ్చేందుకు రెల్లి కులాన్ని స్వీకరించా. నేను రాజకీయాల్లోకి ఏమీ ఆశించి రాలేదు. తెలంగాణ ప్రాంత నాయకులు ఆంధ్రా ప్రజలపై తిరుగుబాటు చేస్తే ఆంధ్రుల పక్షాన ఉండి నేనొక్కడినే పోరాటం చేశా. పాలకులు చేస్తున్న తప్పులకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి?’ అని పవన్ ప్రశ్నించారు.