ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల సమయం ముగుస్తున్నా ఏపీలో ఇంకా వైసీపీలోకి వలసల జోరు ఆగకపోవడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయితే.. వార్ వన్ సైడే అన్నట్టుగా టీడీపీకి ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది నేతలు వైసీపీలో చేరారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడారు. టికెట్ దక్కిన అభ్యర్థులు కూడా వైసీపీ వైపు చూశారు. ఇంకా 17 రోజులే పోలింగ్ సమయం. అయినా కూడా టీడీపీ నుంచి వలసలు పోవడం ఆగట్లేదు.
తాజాగా పీగన్నవరం ఎమ్మెల్యే పులపర్లి నారాయణమూర్తి టీడీపీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇవాళ పిఠాపురంలో జరగనున్న వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ఆయన వైఎస్సార్సీపీ పార్టీలో చేరుతున్నారట.పీగన్నవరం టికెట్‌ను ఈసారి నారాయణమూర్తికి కేటాయించలేదు. నేలపూడి స్టాలిన్‌కు కేటాయించారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది వైసీపీలో చేరుతున్నట్టు సమాచారం.
అయితే.. నారాయణమూర్తి టీడీపీని వీడే సూచనలు కనిపించిన నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబును రంగంలోకి దింపి నారాయణమూర్తిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. నారాయణమూర్తి మాత్రం వైసీపీలో చేరడానికే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.