ప్రస్తుతం ప్రపంచదేశాలను ముప్పతిప్పలు పెడుతుంది కరోనా మహమ్మారి. కరోనాతో యుద్ధంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిస్తున్నారు. వందల సంఖ్యలో దేశాలు ఆ మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేక చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. ఇక్కడ సైతం కరోనా పోరులో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 308కి చేరగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 9152కి చేరింది. అయితే వీరిలో 857 మంది కోలుకున్నారు లేదా డిశ్చార్జి అయ్యారని తెలుస్తోంది.
ఇక కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ రేపటితో ముగియనుంది. కానీ, వాస్తవానికి లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ ఈ రెండు మాత్రమే వైరస్‌ను కట్టడి చేయగలవు. వైరస్ ఒకరినుంచి ఇతరులకు సోకకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ టైమ్‌లో లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇప్పటి వరకు చేసిందంటా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించాలని పలువురు ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. ఈ క్రమంలోనే నేడు ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్‌డౌన్ పొడిగింపుపై వెలువడుతున్న ఊహాగానాలకు మోదీ చెక్ పెడతారని అందరూ భావించారు. కానీ.. ఊహించని విధంగా ప్రధాని మోదీ ప్రసంగం రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు జాతి నుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాయలం ఓ పోస్ట్ ద్వారా తెలిపింది.