తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల కురుక్షేత్రంలో విజయం కోసం పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారం పర్వం వాడివేడిగా సాగుతుంది. అధికార పార్టీపై విమర్శలు చేస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ అధికార పార్టీ అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు.
దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడల్లో ఒకటైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలు పోరు రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఆరు లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో గౌడ ఓట్లే కీలకంగా మారనున్నాయి. రెడ్డి, గౌడ, మున్నూరు కాపు ఓటర్లు ఉన్నా, గెలుపును నిర్ణయించేది మాత్రం గౌడ సామాజిక వర్గం ఓట్లే. అందుకే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు గౌడ సామాజిక వర్గం నాయకులే ఎక్కువ మంది గెలిచారు. గతంలో కూన శ్రీశైలం గౌడ్ ఉన్నారు. తర్వాత ఒకసారి టిడిపి నుంచి ఒకసారి బిఆర్ఎస్ నుంచి కేపీ వివేకానంద గౌడ్ రెండు సార్లు గెలిచారు. మూడోసారి విజయం సాధించడానికి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఈసారి బిజెపి అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్ బరిలోకి దిగారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కూన శ్రీశైలం గౌడ్ ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాలను తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. అధికార పార్టీ అవినీతి బట్టబయలు చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో వివేకానంద్ విఫలమయ్యారని శ్రీశైలం గౌడ్ విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, అధికార పార్టీ పై వ్యతిరేకత, అధికార పార్టీ అవినీతి ఇవి అన్ని కూన శ్రీశైలం గౌడ్ కు అస్త్రాలుగా మారాయి. రోజురోజుకు ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ ప్రజలకు చేరువ అవుతున్న శ్రీశైలం గౌడ్ ఈసారి కచ్చితంగా కుత్బుల్లాపూర్ లో విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కూన శ్రీశైలం గౌడ్ ప్రచారాన్ని, ప్రజలలో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక ఓటమి భయంతో కేపీ వివేకానంద గౌడ్ దాడి చేశారని సామాన్యుల సైతం విమర్శిస్తున్నారు. సర్వేలన్నీ శ్రీశైలం గౌడ్ విజేతగా నిలుస్తారని, కుత్బుల్లాపూర్ లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నాయి.