ర‌జ‌నీపై పొలిటిక‌ల్ ఫైర్‌.. ఎందుకు… ఎక్క‌డ‌….?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ వ్యవహారం వివాదాలకు దారితీస్తోంది. తాను వ్య‌క్తిగతంగా బిజెపికి అనుకూల‌మ‌ని చెప్పుకునే ఆయన ఏడాదిన్నర కిందట సొంతంగా పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన అభిమానులు పెట్టిన సంఘాన్నే పార్టీ పేరుగా ప్రకటిస్తాన‌ని అన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేస్తాన‌ని చెప్పే ఈ శివాజీ.. తన ర‌జినీ మ‌క్క‌ల్ మండ్రంను మాత్రం ఇప్పటి వరకు ఎన్నికల రాక తీసుకువెళ్ళింది లేనేలేదు. పైగా ఆయన ఏ ఒక్క అభ్యర్థిని ఓన్‌ చేసుకున్నది కూడా లేదు.

Rajinikanth had likened PM Modi and Amit Shah to the duo of Krishna and Arjuna

కానీ, రాజకీయంగా మాత్రం ఆయన చేసే వ్యాఖ్యలు సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. తాజాగా కేంద్రం జమ్మూ క‌శ్మీర్ విషయంలో ఆర్టికల్ 370, 35 ఏలను రద్దు చేసింది. దీనిపై రాజకీయంగా ఆశేతు హిమ‌చ‌లం నుంచి కన్యాకుమారి వరకు అనేక విమర్శలు ప్రతి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడులో అధికార పార్టీ అన్నాడిఎంకే ఈ విష‌యంపై మాట్లాడలేదు. కానీ, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం కేంద్రాన్నిపూర్తిగా తప్పుబట్టింది.

ఆర్టికల్ 370 అనేది క‌శ్మీర్ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హక్కు అని, దీనిని హ‌రించడం ద్వారా వారి విషయంలోకి కేంద్రం నేరుగా చొచ్చుకు వెళ్ల‌డ‌మే అవుతుందని, దీనిని ఇప్పుడు ఉనేక్షిస్తే.. రేపు ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రం చొర‌బాట్ల‌కు దారితీస్తుందని డీఎంకే అధినేత స్టాలిన్ విరుచుకుపడ్డారు. ఇక సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు కూడా కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అదే సమయంలో ఎప్పుడూ రాజకీయ మీడియాలో ఉంటే.. మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు నటుడు.. కమల్ హాసన్ కూడా దీనిపై మౌనం వహించారు. ఏం మాట్లాడితే… ఏం కొంప మునుగుతుందో అని ఆయన నర్మగర్భంగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా స్వాభిమానానికి ప్రాంతీయ తత్వానికి పుట్టినిల్ల‌యిన‌ తమిళనాడులో బీజేపీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, అలాంటి చోట.. తాజాగా ర‌జ‌నీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న సభకు వచ్చిన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి శాలను ఆకాశానికి ఎత్తేశారు. వారిద్దరూ కృష్ణార్జునులు అంటూ సభావేదికపైనే ప్రశంసలు జల్లు కురిపించారు.

ఇది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర వివాదానికి కారణమైంది. ఆర్టిక‌ల్ 14ను కూడా అణ‌దొక్కుతున్న ఈ నేత‌లు కృష్ణార్జ‌నులు ఎలా అయ్యార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై ఇతర పార్టీల నాయకులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రం మొత్తం ఒక దారిలో ఉంటే.. అరుణాచలం మాత్రం ఇలా అడ్డదారి తొక్కుతున్నారేంట‌నే చర్చ సాగుతోంది.