ఆలీకి ఓకే.. మరి ఆ జంపింగ్ నేతల పొజిషన్ ఏంటి?

-

ఎంతోకాలం నుంచి పదవి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సినీ నటుడు ఆలీ కోరిక త్వరలోనే నెరవేరేలా ఉంది..అతి త్వరలోనే ఆలీకి రాజ్యసభ పదవి దక్కనుందని ప్రచారం నడుస్తోంది. తాజాగా పలువురు సినీ ప్రముఖులతో కలిసి ఆలీ..జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు సంబంధించి పలు సమస్యలపై మాట్లాడే సందర్భంలో ఆలీని.. జగన్ మళ్ళీ కలవమని చెప్పారట. అంటే త్వరలోనే ఆయనకు పదవి ఇవ్వడానికి మళ్ళీ కలవమని చెప్పారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే మరో 3నెలల తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. ఇక అందులో ఒక సీటు మైనార్టీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్న జగన్‌.. ఆ అవకాశం ఆలీకి కల్పించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. అప్పుడు ఆయన గుంటూరు ఈస్ట్ గాని, రాజమండ్రి సిటీ సీటు గాని వస్తుందేమో అనుకున్నారు.

కానీ అప్పుడు ఆయనకు సీటు దక్కలేదు. అయినా వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన సరే ఆలీకి ఎలాటి పదవి దక్కలేదు. ఇటీవల ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగా ఆలీ పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ అప్పుడూ ఆలీకి నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు రాజ్యసభకు పంపే అవకాశముందన్న చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో ఆలీ దీనిపై స్పందిస్తూ.. సీఎం తర్వాత కలవమన్నారు.. ఏమిస్తారో తనకు తెలీదని చెప్పుకొచ్చారు.

అయితే ఆలీకి ఒకవేళ రాజ్యసభ ఖరారైతే.. వైసీపీలో చేరిన జంపింగ్ నేతల పొజిషన్ ఏంటి? అనేది చర్చకు వస్తుంది. ఎందుకంటే కొందరు నేతలు టీడీపీ నుంచి వైసీపీలో చేరేటప్పుడు జగన్, రాజ్యసభ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చలమలశెట్టి సునీల్, బీదా మస్తాన్ రావు, శిద్ధా రాఘవరావు లాంటి వారికి రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది. మరి వాళ్ళకు జగన్ ఏ పదవి ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news