ఓవైపు మహానాయకుడు.. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్. రెండూ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లే. కానీ.. రెండింటిలో ఒకదానికి మరోటి సంబంధం ఉండదు. రెండు వేర్వేరు ధృవాలు. ఒకదాంట్లో ఎన్టీఆర్, చంద్రబాబు పాజిటివ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇంకోదాంట్లో పాజిటివ్ లు.. నెగెటివ్ లు కాదు.. అసలు జరిగిందాన్ని.. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అందుకే.. ప్రస్తుతం ఎన్నికల సీజన్ తో పాటు ఎన్టీఆర్ బయోపిక్ లపై కూడా జోరుగా చర్చ నడుస్తోంది.
అంతవరకు బాగానే ఉంది కానీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా వైసీపీకి చెందిన ఓ కీలక నేతతో భేటీ అయ్యాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే.. ఈ సినిమా వెనుక వైఎస్సాఆర్సీపీ హస్తం ఏమీ లేదని ఇదివరకే వర్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి.. ఆ కీలక నేతను వర్మ ఎందుకు కలిసినట్టు. ఆ కీలక నేత ఎవరు అంటారా? ఆయన ఎవరో కాదు.
అంబటి రాంబాబు.. అవును… హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో అంబటితో రాంగోపాల్ వర్మ భేటీ అయ్యాడట. వీరిద్దరు కలిసి దాదాపు 30 నిమిషాల పాటు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. కాకపోతే వీళ్లు దేని గురించి చర్చించారు అనేది మాత్రం బయటికి రాలేదు. ఇటీవలే వైఎస్ జగన్, లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్ రెడ్డితో కలిసి ఉన్న ఓ ఫోటోను ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.
Rakesh Reddy is the man on the left with a smile, his friend is in the centre and I don’t know who the man is on the right. pic.twitter.com/GSQ9VJ7cfB
— Ram Gopal Varma (@RGVzoomin) February 15, 2019
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు.. వైసీపీకి ఎటువంటి సంబంధం లేకున్నప్పటికీ… వర్మ వైసీపీ నేతను కలవడంతో వర్మ కొంపదీసి వైసీపీలో చేరుతాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఓవైపు సినీ అభిమానులు.. మరో వైపు రాజకీయ అభిమానులు రోజురోజుకూ ఏపీలో మారుతున్న రాజకీయాలను అంచనా వేయలేకపోతున్నారు. ఇదివరకు టీడీపీ నుంచి చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినీ నటుడు నాగార్జున కూడా వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. దీంతో నాగార్జున వైసీపీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. తాజాగా వర్మ భేటీ వెనుక ఉన్న మర్మమేమిటో తెలుసుకునే పనిలో పడ్డారు రాజకీయ విశ్లేషకులు.