ఏపీలో ఎన్నికలు కాస్త వేడీవాడీగానే జరుగుతున్నాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. గుడెం చెరువు ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్ తో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురుగా విడగొట్టారు. ఘర్షణలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహంతి వెంటనే జమ్మలమడుగుకు చేరుకున్నారు.
బద్వేలు నియోజకవర్గంలోనూ వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. కాశీనయన మండలంలోని గొంతువారిపల్లెలో ఉన్న 97వ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన వైసీపీ నేతలు ఓటేయడానికి వచ్చిన ఓటర్లను బయటకు పంపించారని.. పోలింగ్ కేంద్రం డోర్స్ మూసేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.